కరోనా  కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంటే , అక్కడ మాత్రం లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్నాయా  ? లేదా ?? అన్న అనుమానాలు కలుగుతున్నాయి  . హైదరాబాద్ పాతబస్తీ లో  లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజలు ఇష్టారీతిలో  రోడ్లపైకి వస్తుండడం వల్లే కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయన్న వాదనలు విన్పిస్తున్నాయి . ఈ వాదనలు నిజమేనన్నట్లుగా హైదరాబాద్ పాతబస్తీ లో రోజుకిన్ని  కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా   నమోదు కావడం గమనార్హం .

 

పాతబస్తీ లో లాక్ డౌన్ నిబంధనలు ఏమాత్రం అమలుకావడం లేదని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం , కఠినంగా నిబంధనలను అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు తెలుస్తోంది . పాతబస్తీని ప్రత్యేక జోన్ గా పరిగణించి లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ఉన్నతాధికారులను రంగం లోకి దించాలని నిర్ణయించింది . ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న పాతబస్తీ లో మాత్రం సాధారణ రోజుల్లో రోడ్లపై రద్దీ ఎలా ఉందో, ఇప్పుడు అలాగే కొనసాగుతుంది . ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ అమలు చేసి మాత్రం ప్రయోజనం ఏమిటన్న వాదనలు విన్పిస్తున్నాయి . కరోనా కట్టడి కోసం కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజలు రోడ్లపైకి వస్తుంటే ,  పోలీసులు వారిని కట్టడి చేయడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి .

 

నగరం లోని ఇతర ప్రాంతాల్లో రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తుండగా , పాతబస్తీలో మాత్రం అటువంటి సంఘటనలు అరుదనే చెప్పాలి .  కరోనా సోకిన వ్యక్తులు లాక్ డౌన్ నిబంధలను పాటించకుండా రోడ్లపైకి రావడం వల్లే ఒక్కరి నుంచి పదులసంఖ్యలో వ్యక్తులకు ఈ వ్యాధిని వ్యాప్తి చేస్తున్నారన్న వాదనలు విన్పిస్తున్నాయి . దానికి తలాబ్ కట్ట ఉదంతాన్ని పలువురు ఉదహరిస్తున్నారు . తలాబ్ కట్ట లో ఒక వ్యక్తి నుంచి పలువురికి కరోనా వైరస్ వ్యాప్తి చెందిన విషయం తెల్సిందే  .  

మరింత సమాచారం తెలుసుకోండి: