ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 26 లక్షలకు చేరువైంది. కరోనా కారణంగా లక్షా 78 వేల మందికి పైగా మృతి చెందగా, 7 లక్షల మందికిపైగా కోలుకున్నారు. ఇలాంటి త‌రుణంలో, అమెరికాలోని సెంట్రల్ ఫర్ డిసీజ్ (సీడీసీ) కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. సీడీసీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్  వైట్ హౌజ్‌లో మీడియాతో మాట్లాడుతూ, ప్ర‌పంచాన్ని వణికిస్తున్న కరోనాను ఇప్పుడే కట్టడి చేయాలని, ఒక‌వేళ మళ్లీ పున‌రావృత్తం అయిందంటే దాన్ని నిరోధించ‌డం అయ్యే ప‌ని కాదని  హెచ్చరించారు. 

 

ప్రస్తుతం కరోనా నుంచి బయటపడినట్లు భావిస్తున్న దేశాలు సంతోష పడాల్సిన అవసరం లేదని…తిరిగి వైరస్ సోకితే ప్రమాదం తప్పదని సీడీసీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ చెప్పారు. చలికాలం వచ్చే నాటికి కరోనాను ఖతం చేయాలన్నారు. లేదంటే ఫ్లూ సీజన్‌కు తోడు కరోనా మొదలైందంటే మొత్తం ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ దెబ్బతింటుందన్నారు. జపాన్, సౌత్ కొరియా, చైనాలో వైరస్ తగ్గిందనుకుంటే మళ్లీ కొత్త కేసులు నమోదవతున్న విషయాన్ని రాబర్ట్ గుర్తు చేశారు. కరోనాకు వ్యాక్సిన్ రావటమో లేదంటే పూర్తిగా వైరస్ నిర్మూలించే వరకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు.  ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ నాటికి కరోనాను ప్రపంచం నుంచి తరిమేయాలని రాబర్ట్ రెడ్ ఫీల్డ్ సూచించారు. అమెరికాలో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న లాక్ డౌన్ ఎత్తివేయాలంటూ పలు రాష్ట్రాల గవర్నర్లు కోరుతుండటాన్ని రాబర్ట్ తప్పుబట్టారు. తన హెచ్చరికలను కొంతమంది పట్టించుకోవటం లేదని…దానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.

 

ఇదిలాఉండ‌గా, లాక్ డౌన్ పొడిగించిన ఫలితంగా ఇతర దేశాల కన్నా ఇండియా కరోనా అదుపులో చాలా ముందంజలో ఉన్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.  మ‌న దేశంలో మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్త‌ర ప్ర‌దేశ్‌, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఒక్క రోజులోనే ఈ రాష్ట్రాల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరిగింది.  కాగా క‌రోనా కేసుల నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్లు తెలిపింది. రికవరీ రేటు 17.5 శాతానికి పెరిగింది. ప్రపంచంలో కరోనా కేసుల నమోదులో 20 వేలకు పైగా కేసులతో ఇండియా 17 స్థానంలో ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: