అవును.. ఏపీలోని జగన్ సర్కార్‌ ఇప్పుడు ఒక విషయంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానం సంపాదించిందట. ఏ విషయంలో అంటారా.. ఇక ఇప్పుడు వేరే విషయాలు ఏమున్నాయని.. ఎటు చూసినా కనిపించేది కరోనా ఒక్కటే కదా. ఆ కరోనా విషయంలోనే. కరోనా పరీక్షలలో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానానికి చేరుకుందని ఆ రాష్ట్ర అధికారులు చెబుతున్నారు.

 

 

కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో అధికారులు ఈ విషయాలు సీఎంకు చెప్పారట. ఇప్పటివరకు 41,512 మందికి పరీక్షలు చేసినట్టుగా వెల్లడించారు. ప్రతి పదిలక్షల జనాభాకు 830 మందికి పరీక్షలు చేశామని.. ఆంధ్ర ప్రదేశ్‌ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారట. 809 పరీక్షలతో రాజస్థాన్‌ రెండో స్థానంలో ఉందట. ఏపీలో ట్రూనాట్‌ పరీక్షల నమోదుకు ఐసీఎంఆర్‌ అనుమతులు ఇచ్చిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 5,757 పరీక్షలు చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

 

 

ఇక ఏపీకి రాజస్థాన్‌ తరహా చైనా కిట్లను విక్రయించేందుకు సంబంధిత వ్యక్తులు ముందుకొచ్చారని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కానీ మనం కొరియా నుంచి నాణ్యమైన ర్యాపిడ్‌ టెస్టు కిట్లను తెప్పించామని పేర్కొన్నారు. అమెరికాకు వెళ్లాల్సిన కిట్లను చార్టర్‌ విమానం ద్వారా తెప్పించుకున్నామని అధికారులు వెల్లడించారు. ఇప్పటికి 5 నుంచి 6 వేల శాంపిళ్లను పరిశీలించామని అన్నారు.

 

 

ఈ ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లు మంచి పనితీరు కనబరుస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కరోనా రోగులకు వివిధ దేశాల్లో అనుసరిస్తున్న వైద్య విధానాలపై నిరంతర అధ్యయనం, పరిశీలన చేస్తున్నామన్నారు. అయితే ఈ విషయం తెలిస్తే..ఇదంతా నా క్రెడిటే అని చంద్రబాబు అన్నా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు వైసీపీ నాయకులు. పరీక్షల సంఖ్య పెంచాలని తాను మొదటి నుంచి చెబుతున్నానని.. తాను చెప్పడం వల్లే ఈ కిట్లు తెప్పించామని రేపు చంద్రబాబు అన్నా అంటారని వారు సెటైర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: