సరిగ్గా రెండు రోజుల క్రితం వలసదారులకు అమెరికాలో స్థానం లేదంటూ హుంకరించిన ట్రంప్.. ఇంతలోనే కాస్త గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటో చెప్పుకోబోయే ముందు అసలు ట్రంప్ మొన్న ఏమన్నాడో తెలుసుకుందాం.. కరోనా వైరస్ కారణంగా... అమెరికాలో చాలా మంది స్థానికులకు ఉద్యోగాలు పోతున్నాయన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... తాను వలసదారీ విధానాన్ని తాత్కాలికంగా రద్దుచేయబోతున్నానన్నాడు.

 

 

ఈ మేరకు పరిపాలనా పరమైన ఆదేశంపై సంతకం చేస్తానని ప్రకటించారు. కనిపించని శత్రువు దాడి చేస్తోంది. దాన్ని కరోనా వైరస్ అని పిలుస్తున్నారు. గ్రేట్ అమెరికన్ పౌరుల ఉద్యోగాల్ని కాపాడాల్సిన అవసరం ఉంది అంటూ ట్రంప్ తన ప్రకటనలో మొన్న చెప్పుకొచ్చారు. అమెరికా షట్‌డౌన్ నుంచి కొంతవరకు తిరిగి తెరుచుకునే అవకాశం ఉండటంతో ట్రంప్ ఈ ప్రకటన చేసినట్లు భావించారు.

 

 

ట్రంప్ ప్రకటనతో ఎన్నారైల్లో నిరుత్సాహం నెలకొంది. అయితే ఇంతలోనే ట్రంప్ కాస్త ఊరటనిచ్చే మరో ప్రకటన చేశారు. వలసదారులకు నో ఎంట్రీ అన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అది అరవై రోజులకే పరిమితమంటున్నారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ చెబుతున్నారు. అమెరికాలో ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న తర్వాత స్థానిక పౌరులకే ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం ఉండాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెప్పుకొస్తున్నారు.

 

 

ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న తర్వాత ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం ఇక్కడి వారికి ఉండాలన్నది తమ ఉద్దేశమని ట్రంప్ వివరించారు. కరోనా వైరస్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారి బదులు వలసదారులకు అవకాశం ఇస్తే ఇక్కడి పౌరులకు అన్యాయం చేసినట్లు అవుతుందని ట్రంప్ అంటున్నారు. ట్రంప్ మాటలను బట్టి చూస్తే ఎన్నారైలకు కాస్త కష్టకాలంగానే అనిపిస్తున్నా.. 60 రోజుల వరకే అన్న ప్రకటన కాస్త ఊరటనిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: