దేశంలో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. దేశంలో కరోనా కేసులు 21 వేలు దాటాయి. ప్ర‌స్తుత త‌రుణంలో లాక్ డౌన్ కార‌ణంగా సానుకూల ఫ‌లితాలు వ‌స్తున్న‌ప్ప‌‌టికీ అదే స‌మ‌యంలో  వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వ‌ల‌స కార్మికుల ప‌రిస్థితి దారుణంగా ఉంది. వ‌లస ‌కార్మికుల‌ను కాపాడేందుకు వివిధ రాష్ట్రాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. వలస కార్మికుల కోసం ప్ర‌త్యేక రైళ్లు నడపాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే, వారిని చేర‌వేసేందుకు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌ప‌బోమ‌ని కేంద్రం మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. వలస కార్మికులు ఎక్కడివారు అక్కడే ఉండాలని తేల్చిచెప్పింది. 

 

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ వలస కార్మికుల కోసం ప్ర‌త్యేక రైళ్లు నడపాలని మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చిందని, మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్‌ ధాక్రే చేసిన‌ వినతికి నో చెప్పామని తెలిపారు. దేశంలో మరోసారి నిజాముద్దీన్ తరహా పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతోనే మహారాష్ట్ర నుంచి రైళ్లను నడిపేందుకు సిద్ధంగా లేనట్లు ఆయన పేర్కొన్నారు. వలస కార్మికుల పరిస్థితిని, వారి మనోభావాలను తాను అర్థం చేసుకోగలనని.. కానీ ఎటువంటి ముందు జాగ్రత్తలు లేకుండా వారిని స్వస్థలాలకు పంపించలేమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. 


ఇదిలాఉండ‌గా దేశంలో క‌రోనా బాధితుల సంఖ్య 21,359కి చేరుకున్నది. కొత్తగా 1,486 కేసులు నమోదు కాగా 49 మంది మరణించారు. దీంతో మరణించిన వారి సంఖ్య 685కి చేరుకున్నది. దేశంలో ప్రస్తుతం 16,507 యాక్టివ్‌ కేసులున్నాయని, ఇప్పటి వరకు 4,103 మంది డిశ్చార్జి అయ్యారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. మహారాష్ర్టలో 5,649 కేసులు నమోదవ్వగా 269 మంది చనిపోయారు. గుజరాత్‌లో 2,407 మందికి వైరస్‌ సోకగా 103 మంది మరణించారు. వెయ్యికి పైగా కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఢిల్లీ (2248), రాజస్థాన్‌ (1868), తమిళనాడు (1629), మధ్యప్రదేశ్‌ (1587), ఉత్తర్‌ప్రదేశ్‌ (1449) ఉన్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: