కరోనా లాక్ డౌన్ దెబ్బకు ఉప్పు రైతులు విలవిల్లాడుతున్నారు. ఈ వేసవిలో ఉత్పత్తి బాగా పెరుగుతుందని భావించిన రైతులను, కూలీల కొరత వేధిస్తోంది. వస్తున్న ఉత్పత్తిని మార్కెట్లో అమ్ముకుందామంటే,  ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం లేక నానా అగచాట్లు పడుతున్నారు. 

 

నెల్లూరు జిల్లాలోని ఉప్పు రైతులు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో అష్టకష్టాలు పడుతున్నారు. నెల్లూరు జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలలో ఐదు వేల ఎకరాలలో  ఉప్పు ఉత్పత్తి జరుగుతుంది. విడవలూరు, అల్లూరు  మండలాలలో ఎక్కువుగా ఉప్పును ఉత్పత్తి చేస్తారు. సముద్ర తీర ప్రాంతాలలోని మడులలోకి , నీటిని వదిలి వాటి ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఏటా ఫిబ్రవరి నుంచి ఉప్పు ఉత్పత్తికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి లేకుండా పోయింది. 

 

నెల్లూరు సముద్ర తీర ప్రాంతాల్లో సుమారు 500పైగా కుటుంబాలు,  ఉప్పు ఉత్పత్తి తో జీవనం సాగిస్తుంటాయి. ఇక్కడ నుంచే ఇతర రాష్టాలకు ఉప్పును ఎగుమతి చేస్తుంటారు.అయితే ఇప్పుడు ఉప్పు ఉత్పత్తి ,అమ్మకాల పై లాక్ డౌన్ ప్రభావం చూపుతుంది. కూలీలు దొరక్కపోవడంతో ఉప్పు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది. దీంతో సాగుదారులు ఏం చేయాలో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు. 

 

గతేడాది సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో ఆగిపోయిన ఉప్పు ఉత్పత్తి ఈసారి పుంజు కుంటుందని రైతులు తమ కయ్యలను సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ వల్ల కూలీలందరూ ఎక్కడివారక్కడ ఇళ్లకే పరిమితమయ్యారు. పనులకు పిలిచినా కరోనా భయానికి వెనకడుగు వేస్తుండటంతో,  ఈసారి ఉత్పత్తి పడిపోయింది. పెట్టిన పెట్టుబడులు కూడా రావేమోనన్న ఆందోళన సాగుదారుల్లో వ్యక్తమవుతోంది. 

 

పుండు మీద కారం చల్లినట్లు పది రోజుల క్రితం కురిసిన వర్షాలకు, ఉప్పు తడిచిపోవడంతో  రైతులు బాగా నష్టపోయారు.దీనికి తోడు రవాణా సౌకర్యం అగిపోవడంతో వ్యాపారులు  ఎవ్వరు ఉప్పును కొనుగొలు చేయడానికి రాలేదు. లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికి పెద్ద పెద్ద కంపెనీలు ఉప్పును కొనుగొలు చేయడానికి అసక్తి చూపడం లేదని సాగుదారులంటున్నారు. ప్రస్తుతం క్వింటాల్ ఉప్పు.. 80 రూపాయలు ధర పలుకుతుంది. దీని ధర పెంచాలని ఉప్పు రైతులు కోరుకుంటున్నారు.


 
తమకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉప్పు ఉత్పత్తిదారులు కోరుతున్నారు. లాక్ డౌన్ లోనూ, కల్లాల్లో కూలీలు పని చేసేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: