చుక్క లేక తిక్క తిక్క చేస్తున్నారు మందు బాబులు. బ్రాండ్‌తో పని లేకుండా.. ఒక్క పెగ్గు ఉంటే చాలు అంటున్నారు. అందుకోసం నాటుసారా వైపు పరుగులు పెడుతున్నారు.. సరిగ్గా ఈ అవకాశాన్నే తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు కొందరు నాటుసారా గాళ్లు.

 

కరోనా కారణంగా వచ్చిన లాక్ డౌన్ వల్ల వచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. కడుపులో సమయానికి ముద్ద లేకున్నా పర్వాలేదు కానీ చుక్క పడకపోతే మాత్రం ప్రాణం పోయినంత పని చేస్తున్నారు మందు బాబులు. బ్రాండ్ తో పని లేకుండా.. ఏదో ఒకటి  నాలుగు చుక్కలు నోట్లో పడితే చాలన్నట్లు మందు కోసం ఉరుకులు పరుగులు తీస్తున్నారు. కల్లు కోసం కల్లు దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. అలాగే గ్రామీణ  ప్రాంతాల్లో తాటి వనాల వద్ద ఈ మందు బాబుల హాల్‌చల్‌ అంతా ఇంతా కాదు. అదీ కూడా సరిపోకపోవడంతో.. ఎక్కడ కూడా మందు దొరక్కపోవడంతో.. చివరకు గుడుంబా, నాటుసారాల వైపు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది.

 

లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని రోజులుగా మద్యం లభించకపోవడంతో పిచ్చివాళ్లుగా మారుతున్నారు చాలామంది మందుబాబులు. నగరంలోని పలుచోట్ల కొందరు మద్యం లేక నానా అవస్థలు పడుతున్నారు. మద్యం షాపు వద్దకు వచ్చి మద్యం ఇవ్వాలంటూ మారాం చేస్తున్నారు. మరికొంతమంది వైన్‌ షాపుల వద్ద మద్యం కోసం పడిగాపులు పడుతున్నారు. ఒక్కోసారి మద్యం దొరక్క మతిస్థిమితం కోల్పోవడమే కాదు..ఆత్మహత్య చేసుకుంటున్నారు.

 

లాక్ డౌన్ మొదట్లో మందు బాబులను అక్కడక్కడా బెల్టు షాపులు ఆదుకున్నా.. అక్కడ కూడా నిల్వలు అడుగంటిపోవడం.. ధరలు నింగినంటడంతో లబోదిబోమన్నారు. మొన్నటి వరకు ఖరీదైన బ్రాండ్లు తప్ప మద్యం ముట్టని బడాబాబులు కూడా చోటామోటా బ్రాండ్లతో సరిపుచ్చుకుంటున్నారు. వెయ్యి ఖరీదు చేసే మందు బాటిల్ బ్లాక్ లో ఐదు వేలు పలుకుతోంది. అయితే అక్కడ కూడా మందు సీసాలు ఖాళీ కావడంతో.. కల్లు, గుడుంబా, నాటుసారా కోసం పరుగులు తీస్తున్నారు. ఈ మూడే ప్రస్తుతం మందుబాబులకు ఆదుకుంటున్నాయి. అయితే, ఇవీ కూడా ఎక్కడపడితే అక్కడ దొరకడంలేదు. కేవలం మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనే ఇవి లభ్యమవుతున్నాయి. గుడుంబా అమ్మకాలను నిషేధించడంతో ఐదేళ్ల క్రితమే వీటి తయారీని నిలిపివేసిన తయారీదారులు.. ఇప్పుడీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. దీంతో గుట్టుగా నాటుసారా బట్టీలను మొదలుపెట్టారు. 

 

మందుబాబుల బలహీనతను ఆసరగా చేసుకొని.. కొందరు నాటుసారా గాళ్లు మారుమూల గిరిజన గ్రామాలను తమ స్థావరాలకుగా చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా లీటర్లకు లీటర్లు సారా కాసేస్తున్నారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ఏజెన్సీ గ్రామాలు నాటుసారా డెన్లుగా మారిపోయాయి.
వెనుకబడిన ప్రాంతాలకు బ్రాండ్ అంబాసిడర్ గా  పేరుపొందిన సిక్కోలు జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో అడవులను స్థావరంగా చేసుకొని.. గుట్టు చప్పుడు కాకుండా బెల్లం ఊటలను దాచేసి .. తాపీగా నాటు సారాను సరిహద్దులు దాటించి అమాయకుల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు . 

 

శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ భాగం ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోనే ఉంది . పాలకొండ నుంచి పాతపట్నం వరకూ.. మందస నుంచి మెళియాపుట్టి వరకూ ఎంతో కొంత ప్రాంతం ఒడిశాతోనే మమేకమై ఉంటుంది. ఇక్కడ మన్యంలో నాటుసారా బ్యాచ్ ఆగడాలు ఎక్కువైపోయాయి. బెల్లం ఊటలను పులియబెట్టి.. ఆ తర్వాత దర్జాగా ప్యాకెట్లు, క్యాన్ల రూపంలో తరలించేస్తున్నారు. ఏజన్సీ ప్రాంతాల్లోని నాటుసారా స్థావరాల పై పోలీసులు నిఘా పెట్టడంతో.. సామాన్యులెవరూ వెళ్లలేని మారుమూల గిరిజన గ్రామాలను తమకు అనుకూలమైన ప్రాంతాలుగా ఎంచుకుంటున్నారు . 

 

పాతపట్నం నియోజకవర్గం పరిధిలోని మెళియాపుట్టి మండలం పూర్తిగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లోనే ఉంది. మెళియాపుట్టి మండలంలోని భరణికోట, కేరాసింగి, వెంకటాపురం, బాణాపురం, పరశురాంపురం పంచాయతీలు పూర్తి స్థాయిగిరిజన ప్రాంతాలు. సాధారణంగా ఇక్కడికి ఎవరూ వెళ్లరు. దీంతో నాటుసారా తయారీ గ్యాంగ్ ఈ పంచాయతీని తమకు అడ్డాగా మార్చుకుంది . భరణికోట పంచాయతీ పరిధిలోని భావనపురం, తంగిని, మర, బాలేరు, భరణికోట, కేరాసింగి పంచాయతీ పరిధిలోని నేలబొంతు, గొడ్డ, డబారు.. వెంకటాపురం పంచాయతీ పరిధిలో వెంకటాపురం, జంతూరు, ఎగువ బందపల్లి.. బాణాపురం పంచాయతీ పరిధిలో బాణాపురం, బాలేరు, బగడ.. పరశురాంపురం పంచాయతీ పరిధిలో పరశురాంపురం నందవ, తోవూరు తదితర గ్రామాలు ఎక్కడో కొండల్లో విసిరేసినట్లు ఉంటాయి. ఈ గ్రామాల వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడరన్న వాస్తవం తెలుసుకున్న నాటుసారా బ్యాచ్ గడచిన నెలరోజులుగా భారీ స్థాయిలో సారా తయారు చేస్తోంది. అయితే నాటుసారా తయారీ చేస్తున్నారన్న సమాచారం మెళియాపుట్టి పోలీసులు రావడంతో.. గిరిజన పంచాయతీల పరిధిలోని గ్రామాలను జల్లెడ పడుతున్నారు. కొండల్లో ఎక్కడో రహస్యంగా దాచిపెట్టిన బెల్లం ఊటలను , నాటుసార బట్టీలను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు. ఇలా గడిచిన 20 రోజుల్లో ఒక్క మెళియాపుట్టి ఏజెన్సీప్రాంతంలోనే 20 వేల లీటర్లకు పైగా నాటుసారా బెల్లపు ఊటలను పోలీసులు కనిపెట్టి ధ్వంసం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: