కరోనా దెబ్బకు చిత్తూరు జిల్లాలో టమోటా మార్కెట్ కుదేలైంది. లాక్‌డౌన్‌ కారణంగా ఈ ఏడాది టమోటా రైతులు నిండా మునిగారు. అప్పులు చేసి మరీ పండించిన పంటంతా నేలపాలు చేస్తున్నారు. అసలే కరోనాతో అల్లాడిపోతున్న రైతులను కమీషన్ల రూపంలోనూ దళారులు దండుకుంటున్నారు.

 

చిత్తూరు జిల్లా టమోటా పంటకు ప్రసిద్ధి. నిత్యం టమోటా రైతులతో కిటకిటలాడే మదనపల్లె టమోటా మార్కెట్ కరోనా కారణంగా ఖాళీగా దర్శినమిస్తోంది. మదనపల్లి మార్కెట్ యార్డు తర్వాత ఆ స్థాయిలో పేరుగాంచింది వి.కోట మండల కేంద్రంలోని టమాట మార్కెట్. వి. కోట మండలంలో ఈ దఫా టమాట బాగా పండింది. వి.కోట మండలం మూడు రాష్ట్రాల కూడలి. వంద కిలోమీటర్ల పరిధిలోనే ఇటు బెంగళూరు...అటు చెన్నై మహానగరాలు ఉన్నాయి. ఆ రెండు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు వి.కోట టమోటా మార్కెట్‌కు పంటను తీసుకొస్తారు. మూడు రాష్ట్రాల నుంచి టమోటా వ్యాపారులు ఇక్కడకు చేరుకుని రైతుల వద్ద నుంచి పంట కొంటూ ఉంటారు.

 

ఇక...ఈ ఏడాదైనా ఎంతోకొంత సంపాదించుకుందామని టమోటా రైతు బాగా ఆశపడ్డాడు. అయితే టమోటా రైతుల ఆశలను నిలువునా కాటేసింది కరోనా వైరస్. మదనపల్లె మార్కెట్‌లో నిత్యం మూడు వందల టన్నులు వచ్చే టమోటా కరోనా దెబ్బకు 150 టన్నులు రావడం లేదంటున్నారు అధికారులు. టమోటా కొనాలంటే మార్కెట్‌లో సగటున కిలో 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఉంది. అమ్మే రైతుకు మాత్రం కిలోకు ఒక్క రూపాయి కూడా గిట్టుబాటు కావడం లేదు. 

 

చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో టమోటా సాగు అధికం. మార్చి చివరి వారంలో కోతకొచ్చిన టమోటాను లాక్‌డౌన్‌ వల్ల అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల తోటల్లోనే వదిలేశారు. మార్కెట్లు తెరిచాక ప్రారంభంలో కొనుగోలు చేయడంలో పోటీ పెరిగి కిలోకు 7 రూపాయల నుంచి 10 రూపాయల వరకు రైతుబజార్లలో దక్కింది. ఇప్పుడు మళ్లీ పడిపోయి కిలోకు 1 నుంచి 3 రూపాయలే లభిస్తోంది. దీంతో కొన్నిచోట్ల పొలాల్లోనే వదిలేస్తున్నారు. పండ్లు, కూరగాయల అమ్మకాలపై ప్రభుత్వం  కమీషన్‌ రద్దు చేసినా, క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కావడం లేదు. దళారులు పది శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు. 

 

ఆరుగాలం శ్రమించి, పండించిన పంటను మార్కెట్‌కు తీసుకు వస్తున్న రైతుకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. టమాట కొనుగోలుకు బయటి వ్యాపారులు రావడం లేదు. చివరకు ఏమి చేయాలో తెలియక అక్కడే పారబోసి రైతులు వెనుదిరుగుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. దుకాణాలు, మార్కెట్లు మూతపడ్డాయి. మదనపల్లె,వి.కోట, మార్కెట్లో లావాదేవీలు జరగడం లేదు. ఎకరాకు లక్ష రూపాయలు అప్పు చేసి రైతులు టమాట పండించారు. ప్రభుత్వం కొన్నిచోట్ల నిత్యావసర వస్తువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఐతే కనీసం ఆ ప్రాంతాలకు పంట తీసుకువెళ్లాలన్నా రవాణా ఖర్చులు రైతులు భరించలేని పరిస్థితి. లాక్ డౌన్ కారణంగా వాహనాలు రోడ్లపైకి రావడం లేదు. చివరకు టమాటాలను పంచాయితీ కార్యాలయానికి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. అక్కడ చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద పారబోసి వెళుతున్నారు. 

 

ఇప్పటికైనా ప్రభుత్వం  స్పందించాలని కోరుతున్నారు టమాట రైతులు. తమ పంటను ఇతర రాష్ట్రాలకు తరలించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు.

మరింత సమాచారం తెలుసుకోండి: