రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా,  కొనుగోలు కేంద్రాల్లో  నిబంధనలు రైతులపాలిట శాపంగా మారుతున్నాయి. సరిగ్గా ధాన్యాన్ని అమ్ముకుందామనే తరుణంలో, మొన్న కురిసిన అకాల వర్షాలు దెబ్బతీశాయి. పూటకో రకంగా వాతావరణంలో వస్తున్న మార్పులు.. రైతన్నకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈసారి వరిపంట విస్తారంగా సాగు అయ్యింది. కరీంనగర్,  పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో  అన్నదాతలు పంట సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చే సమయానికి కరోనా లాక్ డౌన్ వచ్చిపడింది. లాక్ డౌన్ కారణంగా రైతుల ఆందోళనను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం,  రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని పదే పదే భరోసా ఇచ్చింది. అయితే అందుకు విరుద్ధంగా కొనుగోలు కేంద్రాల్లో, నిబంధనలు పేరుతో రైతులను అధికారులు ఇబ్బందులు పెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. 

 

లాక్ డౌన్ కష్టాలకుతోడు మొన్న కురిసిన అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి తేమశాతం పెరిగిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో 17 శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామనే నిబంధన ఆందోళన కలిగిస్తుంది. కోతలు పూర్తయ్యాక పొలాలు,ఇళ్ల దగ్గర ధాన్యం ఆరబెట్టుకుంటే, వ్యవసాయ అధికారులు రైతుల పంట వద్దకే వచ్చి తేమ శాతం చూసి టోకెన్లు జారీ చేస్తున్నారు. రేపో మాపో టికెన్లు ఇస్తారని అనుకున్న సమయంలో, మొన్న కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. 

 

పంట అమ్మకం కోసం కిందామీద పడుతున్న రైతులకు కొత్త చిక్కు వచ్చిపడింది. మొన్నటి వర్షాలకు రైతులు పొలాల్లోనూ, కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి టార్పాలిన్ పట్టలు కప్పే సమయం కూడా లేకపోయింది.మరి కొన్నిచోట్ల పట్టలు కప్పినా ఉపయోగం లేకుండా పోయిందని అంటున్నారు రైతులు. షరతులు లేకుండా తమ వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని కరీంనగర్ జిల్లా ధాన్యం రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.  

 

మరోవైపు టోకెన్లు జారీ చేసినా, నిబంధనలు పేరుతో కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని  రైతులు ఆరోపిస్తున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి తాము ఆందోళన లో ఉంటే మళ్ళీ తేమ శాతం పేరు చెప్పి వెనక్కి పంపిస్తున్నారని వాపోతున్నారు రైతులు.గతంలో మార్కెట్ గోడౌన్ లలో ధాన్యాన్ని నిల్వ చేసుకునే సదుపాయం ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదంటున్నారు.  

 

ఇప్పటికైనా టోకెన్ల పేరుతో ఇబ్బందులు పెట్టకుండా చూడాలని పలువురు రైతులు కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని తేమశాతం పేరుతో కొర్రీలు పెట్టకుండా,  కొనుగోలు జరిపే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని  రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: