కరోనా లాక్‌డౌన్‌... మహిళలకు శాపంగా మారింది. అతివలకు కొత్త కష్టాలను తీసుకొచ్చింది. కరోనా ఆంక్షల కంటే... ఇల్లాలికి భర్తపెడుతున్న ఆంక్షలు చుక్కలు చూపిస్తున్నాయి. పని భారానికి.. పతి ఒత్తిడి తోడయ్యింది. గృహహింస కేసులు రోజురోజుకు రెట్టింపవుతుతున్నాయి. లాక్‌డౌన్‌ ఎప్పుడెప్పుడు ఐపోతుందా అని తలలు పట్టుకుంటున్నారు మహిళలు. 

 

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కఠినంగా అమలవుతోంది. దొంగతనాల్లేవు... అత్యాచారాల్లేవు... చైన్‌స్నాచింగుల్లేవు.. మర్డర్లు లేవు..! క్రైం రేట్‌ తగ్గింది. యాక్సిడెంట్ల ఊసే లేదు. ఇదంతా బాగానే ఉన్నా... గృహహింస కేసులు మాత్రం ఎక్కువవుతున్నాయి. సాధారణ రోజుల్లో కంటే... లాక్‌డౌన్‌లో నమోదైన గృహహింస ఘటనలే ఎక్కువ. 

 

పొద్దున లేచింది మొదలు... అర్ధరాత్రి వరకు ఏదో ఒక పని ఒత్తిడితో గజిబిజిగా ఉండే మగాళ్లు... ఇప్పుడు నాలుగు గోడలకే పరిమితమయ్యారు. పనుల్లేక కొందరు... పని ఒత్తిడితో కొందరు.. వర్క్‌ ఫ్రం హోమ్‌ టెన్షన్‌తో కొందరు... మద్యం దొరకక మరికొందరు... ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. ఏంచేయలేక... ఫ్రస్ట్రేషన్‌ ఇంట్లో ఇల్లాలిపై చూపిస్తున్నారు మగరాయుళ్లు. 

 

ఇంటి నుంచి బయటకొచ్చే పరిస్థితి లేకపోవడంతో.. నాలుగు గోడల మధ్యే మహిళలు హింసను మౌనంగా భరిస్తున్నారు. పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు. దీంతో డయల్‌ 100 లేదా మహిళల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నెంబర్లకు అదేపనిగా గృహహింసపై ఫోన్లు వస్తున్నాయి. 

 

గతం నుంచి గృహ హింసను ఎదుర్కొంటున్న మహిళలకు మాత్రం.. లాక్‌డౌన్ మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. ఒకరకంగా చెప్పాలంటే నరకం అనుభవిస్తున్నారు. అనుమానంతో వేధించేవారు కొందరు.. రాచి రంపాన పెట్టేవారు కొందరు.. అయిన దానికి కాని దానికి కన్నీళ్లు పెట్టించేవారు మరికొందరు.. ఇలా రకరకాల కారణాలతో ఇంట్లోని మహిళలు టార్గెట్ అవుతున్నారు.

 

అత్తమామలు, ఆడపడుచులు, ఇతర బంధువులతో కలిసి ఒకే ఇంట్లో ఉండే మహిళల ఆవేదన చెప్పుకోలేనిది.  సమస్య ఏదైనా భార్యవల్లే జరిగిందనే మగానుభావులు ఎక్కువయ్యారు. ఇంట్లో భర్తకు మద్యం తాగే అలవాటు ఉంటే.. అలాంటి కుటుంబాల్లో భార్య ఎదుర్కొంటున్న హింస గురించి ఎంత చెప్పినా తక్కువే. లాక్‌డౌన్‌ తో మద్యం షాప్‌లు, బార్లు, రెస్టారెంట్లు మూసివేశారు. ఎక్కడా చుక్క మందు దొరకడం లేదు.  రోజూ మద్యం తాగందే ఉండలేని మగాళ్లకు పిచ్చెక్కిపోతోంది.  దీంతో కొందరి మగాళ్ల ప్రవర్తన ఉన్మాదులను తలపిస్తోంది. 

 

కరోనా భయంతో ఇంట్లోకి పనివాళ్లను అనమతించడం లేదు. దీంతో పెద్ద కుటుంబాల్లో ఇంటి పనంతా భార్యపైనే పడుతోంది. ఉదయం లేచింది మొదలు.. రాత్రి  పడుకునే వరకూ ఒక యంత్రంలా పనిచెయ్యాల్సి వస్తోంది. ఏది తక్కువ అయినా సూటిపోటి మాటలు, తిట్లు తప్పడం లేదు. భార్యభర్తలు ఉద్యోగస్తులై.. ఇప్పుడు ఇంటిపట్టునే ఉన్న వారికి అయితే తిక్క రేగుతోంది. ఇంటి పనిలో భార్యకు సాయం చేసిన భర్త సైతం.. లాక్‌డౌన్‌ తర్వాత ఫుల్‌ రెస్ట్‌ అంటున్నారు. పిల్లలు అల్లరి చేస్తున్నా..అది కావాలి.. ఇది కావాలి అని మారాం చేస్తున్నా.. పట్టించుకోవడం లేదు. ఒకవేళ తిరిగి భార్య ఏదైనా పనిచెబితే భర్త కోప్పడే పరిస్థితి ఉంది.

 

ఎవరికి చెప్పుకోవాలో.. ఎలా తమ బాధను వ్యక్తం చెయ్యాలో తెలియక గుండె లోతుల్లో బాధను, పంటి బిగువన కోపాన్ని దాచుకొని కామ్‌గా ఉండిపోతున్న మహిళలే ఎక్కువ. అవగాహన ఉన్నవారు మాత్రమే పోలీసులకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: