మ‌హారాష్ట్ర‌లో క‌రోనా వైర‌స్ విజృంభ‌న‌తో సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేకు క‌ష్టాలు త‌ప్ప‌వా..? ఆయ‌న సీఎం పోస్టుకు వైర‌స్ ఎస‌రు పెడుతుందా..? అంటే ప‌లువురు ప‌రిశీల‌కులు మాత్రం ఔన‌నే అంటున్నారు. దేశంలోనే మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 5వేల‌కుపైగా కేసులు న‌మోదు అయ్యాయి. మ‌ర‌ణాల సంఖ్య కూడా 240కుపైగా ఉంది. ఇక దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబైలో ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యార‌వుతోంది. ఇక్క‌డ సామాన్య‌ప్ర‌జ‌లు, వైద్యులు, సిబ్బంది, పోలీసులు, జ‌ర్న‌లిస్టులు.. ఇలా అంద‌రినీ క‌రోనా ప‌ట్టిపీడిస్తోంది. ఈ నేప‌థ్యంలో అంద‌రివేళ్లు ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే వైపే చూపుతున్నాయి. క‌రోనా క‌ట్ట‌డిలో ఆయ‌న విఫ‌లం చెందార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఇక్క‌డ మ‌రొక ముఖ్య‌మైన సాంకేతిక విష‌యం మ‌రొక‌టి ఉంది.. మహా ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే గత యేడాది నవంబర్ 28 న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ సమయంలో ఏ చట్ట సభ కూడా ఆయ‌న‌కు ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆయనను గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలంటూ కేబినెట్ తీర్మానం చేసింది. ఆ గడువు అంటే ఆరు నెల‌ల గ‌డువు ఈ నెల 28 తో ముగిసిపోతుంది.

 

 ఒకవేళ గవర్నర్ క‌నుక‌ సీఎం ఉద్ధవ్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయకపోతే మాత్రం ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో రాజ్యాంగ సంక్షోభం ఏర్ప‌డుతుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. ఇదిలా ఉండ‌గా.. మ‌హారాష్ట్రలో మార్చి 26న తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నా... కరోనా కార‌ణంగా ఎన్నికల కమిషన్ ఆ ఎన్నికలను వాయిదా వేసింది. దీంతో ఒక్క‌సారిగా రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింది. ఈ నేప‌థ్యంలో ఎన్సీపీ నేత, మంత్రి అజిత్ పవార్ వెంట‌నే రంగంలోకి దిగి... గవర్నర్ కోటా నుంచి ఉద్ధవ్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని విజ్ఞప్తి చేశారు.  ఇక్క‌డ మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఉంది.. ప్రస్తుతం గవర్నర్ కోటా నుంచి రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆర్టికల్ 171 ప్రకారం గవర్నర్ సాహిత్యం, కళలు, సామాజిక కార్యకర్త, వివిధ కళల్లో నిష్ణాతులైన వారిని ఆయన కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసే పూర్తి అధికారం ఉంది. అయితే ముఖ్యమంత్రి ఉద్ధవ్ మాత్రం పైన పేర్కొన్న ఏ ఒక్క రంగానికీ చెందిన వారు కాద‌ని, ఆయన ఫక్తు రాజకీయ రంగానికి చెందిన వ్యక్తి అని, ఇలాంటి ప‌రిస్థితుల్లో గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం ఎలా ఉంటుంద‌న్న‌ది అంద‌రిలో ఉత్కంఠ రేపుతోంది. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్ స్పందించ‌లేదు. ఇక ఏ చిన్న అవ‌కాశం దొరికినా అధికారం చేజిక్కించుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేసే బీజేపీ..ఇప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: