ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తూనే ఉంది. కొన్ని జిల్లాల్లో వైరస్‌ తగ్గుముఖం పడుతున్నా... ఇంకొన్ని జిల్లాల్లో మాత్రం కరోనా వైరస్‌ జడలు విప్పుతోంది. కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య డబుల్‌ సెంచరీ దాటగా.. గుంటూరు డబుల్‌ సెంచరీకి చేరువలో ఉంది. చిత్తూరు, కృష్ణా జిల్లాలలో కూడా పాజిటివ్ కేసులు పదుల సంఖ్యలో వస్తూనే ఉన్నాయి. పరిస్థితి చేయిదాటుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

 

ఏపీలో కరోనా పాజిటీవ్‌ కేసుల సంఖ్య 893కు చేరింది. కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైన తొలి నాళ్లల్లో రాష్ట్రంలో ఏయే జిల్లాల్లో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నాయో..  ఇప్పుడు అదే జిల్లాలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం మర్కజ్‌ లింకులు కావడమే అయినప్పటికీ. రాష్ట్రంలో  13 జిల్లాలకు గానూ.. 11 జిల్లాల్లో కరోనా పాజిటీవ్ కేసులు ఉన్నాయి. నాలుగు జిల్లాల్లో మాత్రం కరోనా పాజిటీవ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండడం... అదీ పదుల సంఖ్యలో కావడంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా కర్నూలు, గుంటూరు, చిత్తూరు. కృష్ణా ఈ జిల్లాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి 24 గంటలకూ ఆ నాలుగు జిల్లాలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 

 

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు ప్రభుత్వానికి నిద్రపట్టనీయ్యడం లేదు. ప్రత్యేకించి రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో సగానికిపైగా నాలుగు జిల్లాల్లోనే ఉండటం తీవ్రతకు అద్దంపడుతోంది. మొత్తం 893 కేసుల్లో గుంటూరు, కర్నూలు జిల్లాల్లోనే 429 కేసులు ఉన్నాయి. కృష్ణా, చిత్తూరు కలిపితే ఈ నాలుగు జిల్లాల్లోనే నమోదైన కేసులు సంఖ్య 590.

 

కర్నూలు జిల్లా రాష్ట్రానికే హాట్ స్పాట్ గా మారింది. గురువారం నాటికి  ఈ జిల్లాలో 234 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేసుల సంఖ్యకు తగ్గట్టుగానే మరణాల సంఖ్యలోనూ ఈ జిల్లాలో ముందు వరుసలోనే ఉంది. ఇప్పటికి ఓ డాక్టర్ సహా ఏడుగురు మరణించారు. ఈ జిల్లాలో తబ్లీగ్‌ జమాతేకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య ఎక్కువగాన్నా... మొదటి పది రోజుల వరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు... ఆ తర్వాత మొదలైన పాజిటివ్ ఏసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏ బులిటెన్ చూసినా కర్నూలు కేసులో అగ్రభాగంలో కనిపిస్తోంది. ఇక్కడ నమోదైన కేసుల్లో ఎక్కువ కర్నూలు పట్టణం, నంద్యాల కావడం గమనార్హం. ప్రతి రోజూ వందల సంఖ్యలో శాంపిల్స్ తీసుకుంటున్నారు. ప్రైమరీ, సెకండీరీ కాంటాక్ట్ ను ట్రేస్ చేసి ట్రాక్ చేసి ట్రీట్ చేయడానికి ప్రభుత్వం ఊరుకులు పరుగులు పెడుతోంది. 

 

కర్నూలు తర్వాత   సర్కార్‌ను బాగా కలవరపెడుతోంది గుంటూరు జిల్లా. ఒకటిగా మొదలైన పాజిటివ్ కేసులు ఇప్పుడు 195 కి చేరాయి. ఇంకా వందలాది శాంపిల్స్ ల్యాబ్ ల నుంచి రావాల్సి ఉంది. వీటిలో ఇంకెన్ని పాజిటివ్ కేసులు ఉంటాయో... అవి ఎక్కడ ఉంటాయో అర్థం కాక అధికారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో 27 మంది మరణిస్తే... ఈ జిల్లాలో ఏకంగా ఎనిమిది మంది మరణించారు.  పాజిటివ్ కేసులన్నీ తబ్లీగ్‌ వెళ్లి వచ్చిన వారివో.. వారితో లింకులు ఉన్నవారివో.. వారి ద్వారా ఇతరులకు సంక్రమించిన వారివే ఉన్నాయి. తబ్లీగ్‌ వ్యవహరం తెర మీదకు వచ్చిన తర్వాత కూడా కరోనా వైరస్‌ వ్యాప్తిలో గుంటూరు జిల్లా యంత్రాంగం ఆశించిన స్థాయిలో స్పందించలేదన్న వాదన వినిపిస్తోంది.  ప్రత్యేకించి నరసరావుపేట పట్టణంలో కేసుల సంఖ్య పెరగడాన్ని ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: