ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈరోజు 31 కొత్త కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 234కు చేరింది. అయితే జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. టీడీపీ నేతలు జిల్లాలో వైసీపీ నేతల నిర్లక్ష్యం వల్లే పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. అయితే వైసీపీ మాత్రం ప్రభుత్వం కరోనా నియంత్రణలో సఫలమవుతూ ఉండటంతో ఓర్వలేక టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు. 
 
 
ప్రతిపక్షాలు ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం హఫీజ్ ఖాన్ కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా కొందరు ఒక ఫోటోను వైరల్ చేస్తూ హఫీజ్ ఖాన్ పై విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫోటోపై వివాదం పెద్దది కావడంతో వైరల్ అవుతున్న ఫోటోపై వైసీపీ స్పందించింది. ఒక నర్సు క్వారంటైన్ సెంటర్లో ముస్లిం పెద్దాయన కాళ్లు తాకుతున్న ఫోటో వైరల్ కావడంతో వివాదం మొదలైంది. 
 
ఆ ఫోటోలో వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కూడా ఉండటంతో వివాదం మరింత పెద్దదైంది. ఎమ్మెల్యే దగ్గరుండి మత పెద్ద కాళ్లు పట్టించాడని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే ఆ ఫోటో వెనుక అసలు నిజం గురించి వైసీపీ తెలిపింది. ఇటీవల హఫీజ్ ఖాన్ రాయలసీమ యూనివర్సిటీ క్వారంటైన్ కేంద్రానికి వెళ్లారని... ఆయన అక్కడ వైద్య సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పింది. 
 
అయితే ఆయన అక్కడున్న సమయంలో ఒక ముస్లిం పెద్దాయనకు గేటు తగిలి తీవ్ర రక్తస్రావమైందని... విధుల్లో ఉన్న ఒక నర్సు గాయాన్ని శుభ్రం చేసి కాలికి కట్టు కట్టిందని చెప్పింది. మరి అసలు నిజం తెలిసిన తరువాతైనా టీడీపీ నేతలు దుష్ప్రచారాన్ని ఆపుతారో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: