ప్రముఖ దిన పత్రిక ఈనాడు వార్తలను వక్రీకరించి రాస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. అరటి పండ్లు కొనేవారు లేక ..అంటూ ఈనాడు రాసిన వార్తను ఆయన తప్పుబట్టారు. పాత ఫోటోలతో వార్త రాశారని కన్నబాబు అంటున్నారు. ఈనాడులో వచ్చిన కథనం చూసి తాము కేదారేశ్వరపేట మార్కెట్ కు వెళితే అక్కడ అసలు అలాంటి పరిస్థితే లేదని మంత్రి అన్నారు.

 

 

ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడానికి కొన్ని పత్రికలు వాస్తవాలు రాయకుండా వక్రీకరిస్తున్నాయని, పచ్చి అబద్ధాలు ప్రచురిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హెచ్చరించారు. కొన్ని పత్రికలు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయని మండిపడ్డారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే భావన కలిగించేలా అసత్యాలను ప్రచారం చేయడాన్ని మంత్రి తప్పుపట్టారు.

 

 

ఎందుకు ఇలా వక్రీకరణ చేసి వార్తలు రాస్తున్నారని కన్నబాబు ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనం కోసం ఇలా రాస్తున్నారని మంత్రి అడిగారు. రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించడం కోసం అన్ని విధాలా కృషి చేస్తుంటే, ఈనాడు తప్పుడు రాతలు రాసి ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేస్తోందని కన్నబాబు అంటున్నారు. కరోనా కేసుల విషయంలో కూడా ఈనాడుతో పాటు మరికొన్ని పత్రికలు ఇలాగే రాస్తున్నాయని కన్నబాబు విమర్శించారు.

 

 

రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే అరటిని కొనుగోలు చేస్తుందని కన్నబాబు వివరించారు. ఇతర దేశాలకు ఎగుమతులు లేకపోవడం వల్లనే ధర తగ్గిందన్నారు. రాయలసీమ ప్రాంతంలో పండిన అరటిని రాష్ట్రంలో ఉన్న అని రైతు బజార్లకు తరలిస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద చల్లుతూ.. నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. రైతుల ఆత్మస్థైర్యం దెబ్బ తినకుండా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: