ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని రైతులకు శుభవార్త చెప్పారు. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో గతేడాది సెప్టెంబర్ నెల నుంచి ఈ సంవత్సరం జనవరి వరకు అకాల వర్షాలు, వరదల వల్ల 67,874 మంది రైతులు నష్టపోయారు. ప్రభుత్వం వీరి ఖాతాలలో నగదు జమ చేయనుంది. 
 
ప్రభుత్వం నుంచి వీరి కోసం 54 కోట్ల 52 లక్షల రూపాయల నష్టపరిహారం విడుదలయింది. వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ నిన్న ఒక ప్రకటనలో ప్రభుత్వం నష్టపరిహారాన్ని విడుదల చేసినట్టు తెలిపారు. పంట నష్టపోయిన రైతుల జాబితాలో పేర్లున్న వారికి నగదు జమవుతుంది. ఆధార్ అనుసంధానమైన రైతుల ఖాతాలకు ప్రభుత్వం నగదును జమ చేయనుంది. 
 
ఖాతాలలో నగదు జమ అయిన అనంతరం రైతుల వివరాలను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారని సమాచారం. ప్రభుత్వం నష్ట పరిహారం రైతుల ఖాతాలలో జమ చేయాలని తీసుకున్న నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు, 
 
రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 893కు చేరింది. ఇప్పటివరకు 27 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలలో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో సీఎం జగన్ ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు జిల్లాలపై, దక్షిణ కోస్తాలోని కృష్ణా, గుంటూరు జిల్లాలపై కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 68 శాతం కేసులు ఈ నాలుగు జిల్లాల్లోనే నమోదు కావడం గమనార్హం. ఈ జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: