కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్ర రాజధాని ముంబైలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. తబ్లీగీ జమాత్ మత ప్రార్థనల వల్లే దేశంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయని వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుందని... పరిస్థితులను సమీక్షించి కేంద్రం మూడవ విడత లాక్ డౌన్ గురించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. 
 
ఒక రాష్ట్రం కోరినంత మాత్రాన హెలికాఫ్టర్ ఫండ్ ఇవ్వడం సాధ్యం కాదని.... అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి హెలికాఫ్టర్ ఫండ్ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి వల్ల హెల్త్ ఎమర్జెన్సీ నెలకొందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వలస కార్మికుల రక్షణ కొరకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రంలోకి ప్రజలను ఆహ్వానించే పరిస్థితిలో లేరని చెప్పారు. 
 
ఏ రాష్ట్రంలో ఉన్నవారు అక్కడే ఉండాలని... అక్కడే తగిన ఏర్పాట్లు చేసుకొని కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం వలస కార్మికుల కోసం 12,000 కోట్ల రూపాయలు విడుదల చేసిందని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే మరణాల సంఖ్య పెరుగుతోందని... మరణాల సంఖ్య తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదు కావడం లేదని చెప్పారు. 
 
గడచిన 24 గంటల్లో మహారాష్ట్ర రాష్ట్రంలో 778 కొత్త కేసులు నమోదు కాగా 14 మంత్రి మృతి చెందారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో నిన్న ఒక్కరోజే 522 కరోనా కేసులు నమోదయ్యాయి. మహరాష్ట్రలో నిన్నటివరకు 6427 కరోనా కేసులు నమోదు కాగా ముంబై నగరంలోనే 4205 కేసులు నమోదయ్యాయి. నిన్న మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అహ్వాద్ కు కరోనా నిర్ధారణ అయింది. మంత్రికి కరోనా నిర్ధారణ కావడంతో వైద్యులు ఆయనతో సన్నిహితంగా ఉన్న 100 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: