గ‌త కొద్దికాలంగా అంత‌ర్జాతీయంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన ఉత్తరకొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యం వార్త మ‌రో మ‌లుపు తిరిగింది. కిమ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని సీఎన్ఎన్ వార్తాసంస్థ వార్త ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. కిమ్ కు శస్త్రచికిత్స జరిగిందని, ఆయన పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని పేరుచెప్పని ఓ అమెరికా అధికారిని ఉటంకిస్తూ సీఎన్ఎన్ ఆ వార్తను ప్రసారం చేసింది. ఈ వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. తన బద్ధశత్రువుగా భావించే సీఎన్ఎన్ సంస్థ‌ను ఆయ‌న‌ తప్పుబట్టారు.

 

వైట్‌హౌజ్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ట్రంప్ మాట్లాడుతూ పాత పత్రాల ఆధారంగా ఆ వార్తను ప్రసారం చేశారని ట్రంప్ అన్నారు. అయితే కిమ్ క్షేమంగా ఉన్నట్టు తనవద్ద ప్రత్యక్ష సమాచారం ఉందా అనే విషయమై ఆయన సమాధానం దాటవేశారు. అందుకు బదులుగా ఆయన సీఎన్ఎన్‌పై అక్కసు వెళ్లగక్కారు. కిమ్ క్షేమంగా ఉన్న‌ట్లు తెలుస్తోంద‌ని వెల్ల‌డించారు. కిమ్ ఆరోగ్యం మెరుగ‌ప‌డాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు చెప్పారు. అతనితో త‌న‌కు సత్సంబంధాలే ఉన్నాయని చెప్పిన ట్రంప్‌.... కిమ్‌ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాన‌ని అన్నారు. ఇదిలాఉండ‌గా,  ఉత్తరకొరియా ప్రవాసులు నిర్వహించే డెయిలీ ఎన్-కే అనే ఆన్‌లైన్ మీడియా సంస్థ మాత్రం కిమ్‌కు ఈ నెల ప్రారంభంలో గుండె శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం ఆయన ఉత్తర ప్యోంగ్యాన్ ప్రావిన్స్ లోని ఓ విల్లాలో విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపింది.

 


కాగా,  కిమ్‌ తాతయ్య, ఉత్తర కొరియా నిర్మాతగా పేరుగాంచిన కిమ్‌ ఇల్‌ సంగ్‌ జయంతి వేడుకలు ఈ నెల 15న జరిగాయి. ఉత్తర కొరియాలో అత్యంత ప్రముఖంగా భావించే ఈ కార్యక్రమానికి కిమ్‌ గైర్హాజరయ్యారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు గుప్పుమన్నాయి. కిమ్‌‌ు ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్టు ఓ అమెరికా ఉన్నతాధికారి చెప్పారని సీఎన్‌ఎన్‌ తెలిపింది. కాగా, కిమ్‌ ఆరోగ్యానికి సంబంధించి  ఎలాంటి సమాచారం లేదని దక్షిణ కొరియా తెలిపింది.  మరోవైపు, తమ అధ్యక్షుడి ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఉత్తరకొరియా తోసిపుచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: