మహారాష్ట్ర ఇన్‌టెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంది..! కరోనా విలయం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది..! దేశం మొత్తానికి ఈ రాష్ట్రం హాట్ స్పాట్‌గా మారిపోయింది..! ప్రతి రోజూ నమోదవుతున్న వందలాది కేసులు మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. చివరకు  కేబినెట్ మంత్రికి కూడా కరోనా సోకటం ఆందోళన కలిగిస్తోంది.

 

మహారాష్ట్రలో కరోనా తీవ్రతను చూస్తుంటే... అది పెద్ద ప్రమాదమే ముంచుకొస్తున్నట్లు కనిపిస్తోంది. కరోనా కేసుల్లో మహారాష్ట్ర దూసుకుపోతోంది. దేశవ్యాప్త ట్యాలీ కన్నా మహారాష్ట్ర కరోనా జాబితా ఆందోళన కలిగిస్తోంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 778 కేసులు నమోదయ్యాయి.  రాష్ట్రంలో 283 మంది కరోనాకు బలైపోయారు. నిన్న ఒక్కరోజే 19 మంది కరోనాకు బలైపోయారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,427 కు చేరుకుంది.

 

రాష్ట్రంలో కరోనా కేసులు 7 వేలకు చేరువలో ఉంటే..కోలుకుంది  మాత్రం 840 మంది మాత్రమే.  ఇక ముంబైలో పరిస్థితి రోజురోజుకి చేయి దాటిపోతోంది. కొత్తగా 522 మందికి కరోనా రావడంతో ముంబై కేసుల సంఖ్య 4025కు చేరుకుంది. కరోనా మహమ్మారి రాష్ట్రంలో ప్రవేశించినప్పటి నుంచి ఒకే రోజు ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ముంబై మహానగరంలోనే కరోనాతో 167 మంది చనిపోయారు. దాదాపు 8 లక్షల మంది ప్రజలు నివసించే ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావిలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇక్కడ వైరస్ వ్యాప్తి కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ స్థాయికి చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. ధారావిలో 214 కేసులు నమోదుకాగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మహారాష్ట్రపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ముంబై మహానగరాన్ని 813 కంటైన్మెంట్ జోన్లుగా విభజించారు. ఈ జోన్ల నుంచి ప్రజలు బయటకు రాకుండా ఆంక్షలు విధించారు.  మహారాష్ట్రలో వారం రోజుల వ్యవధిలోనే కేసులు రెట్టింపైనట్టు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. ముంబై, పుణెలో పర్యటించిన కేంద్ర బృందాలతో ఉద్ధవ్‌ థాకరే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం ప్రభుత్వం సూచించిన చర్యలను తక్షణం అమలు చేయాలని సీఎం ఆదేశించారు. కరోనాతో చనిపోయిన మొత్తం బాధితుల్లో 78 శాతం 51 నుంచి 60 యేళ్ల మధ్యవారేనని సీఎం కార్యాలయం ప్రకటించింది..రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 96369 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 

 

మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా వ్యాప్తి మాత్రం నియంత్రణలోకి రావడం లేదు. ఉద్ధవ్ థాక్రే కేబినెట్‌కు కూడా కరోనా అంటుకుంది. ఆ రాష్ట్ర గృహమంత్రి  జితేంద్ర అహ్వాద్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. 54 ఏళ్ల ఈ ఎన్సీపీ నేత ... ముందస్తు చెకప్‌ కోసం థానేలోని ఒక ఆస్పత్రిలో జాయిన్‌ అయ్యారు. తన సెక్యూరిటీలో స్టాఫ్‌కు కరోనా సోకడంతో ఆయన కొన్నాళ్ల పాటు స్వచ్ఛందంగా హోమ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఏప్రిల్‌ 13కు ముందు టెస్టులు చేయించుకున్న జితేంద్రకు... నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. అయితే, తాజాగా ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: