ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం 13,500 రూపాయలను రైతులకు అందిస్తోంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. అకాల వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తోంది. 
 
రాష్ట్రంలో రైతుల సంక్షేమం కొరకు అన్ని రకాల చర్యలు చేపడుతోంది. అయితే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య సేవలన్నీ స్తంభించిపోయాయి. కేంద్రం ఇచ్చే నిధులపైనే రాష్ట్రం ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేసే వరకు ప్రభుత్వానికి ఆదాయం చేకూరే అవకాశం లేదు. 
 
ఇలాంటి తరుణంలో ఏ ప్రభుత్వమైనా ఉన్న నగదును ఖర్చు పెట్టుకోవడంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. అయితే జగన్ కరోనా వ్యాప్తి వల్ల రాష్ట్రం ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా రైతుల సంక్షేమం కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు పెట్టుబడి రాయితీ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇచ్చిన నిధులను ప్రభుత్వం సంక్షేమం వైపు మళ్లిస్తోంది. 
 
వ్యవసాయం చేసే రైతులకు ఏపీ ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చింది. జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. ఈరోజు రాష్ట్రంలో 67,000 మంది రైతుల ఖాతల్లో పంట నష్ట పరిహారం జమైంది. ఆధార్ అనుసంధానం అయిన వారి ఖాతాలలో ప్రభుత్వం నేరుగా నగదు జమ చేసింది. కష్ట కాలంలో రైతులకు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకొని జగన్ మరోసారి గొప్పమనస్సును చాటుకున్నాడని రైతులు ప్రశంసిస్తున్నారు.          

మరింత సమాచారం తెలుసుకోండి: