గత కొన్ని రోజుల నుంచి ఏపీలో ర్యాపిడ్ కిట్ల వివాదం కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే ఎక్కువ రేట్లకు కిట్లను కొనుగోలు చేసిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. అదే సమయంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల విషయంలో కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. కేంద్రం అనుమతి ఇచ్చే వరకు ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో పరీక్షలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జగన్ సర్కార్ కొంత టెన్షన్ కు గురైంది. 
 
ఒకవైపు ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ధరలపై ఆరోపణలు వస్తూ ఉండటం... మరోవైపు ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై ఆంక్షలు విధించడంతో కంగారు పడిన ఏపీ సర్కార్ కు జాతీయ వైద్య పరిశోధనమండలి(ఐసీఎంఆర్) శుభవార్త చెప్పింది. దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం తెప్పించుకున్న కిట్లను వినియోగించవచ్చని తెలిపింది. ఆ కిట్లలో ఎలాంటి లోపం లేదని ఐసీఎంఆర్ పేర్కొంది. ఏపీ ప్రభుత్వం తరపున జవహర్ రెడ్డి ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. 
 
రాజస్థాన్ ప్రభుత్వం చైనా నుంచి కొనుగోలు చేసిన కిట్లలో లోపాలు ఉండటంతో ఐసీఎంఆర్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో కేంద్రం ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై ఆంక్షలు విధించి తాజాగా ఐసీఎంఆర్ నుంచి అనుమతులు రావడంతో ప్రభుత్వం ర్యాపిడ్ టెస్ట్ కిట్లను వినియోగించి పరీక్షలు జరపనుంది. రాష్ట్రంలో ఈ కిట్ల ద్వారా ప్రభుత్వం వేగవంతంగా పరీక్షలు జరపనుంది. 
 
నిజానికి ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షలో ముందుంది. ఏపీలో సగటున పది లక్షల మందిలో 961 మందికి పరీక్షలు జరుపుతున్నారు. తెలంగాణలో పది లక్షల మందిలో 375 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. కొత్త కేసులు నమోదు కాకుండా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: