తెలుగుదేశం పార్టీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇవ్వనున్నారా? టీడీపీకి ఇంకో నెంబర్ తగ్గనుందా? అంటే కాస్త అనుమానంగా అవుననే అనుకోవచ్చు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. అయితే జగన్, తమ పార్టీలో చేరే నేతలు, పదవులకు రాజీనామా చేయాలని రూల్ పెట్టడంతో, టీడీపీ ఎమ్మెల్యేలు పెద్దగా వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపలేదు. ఇదే సమయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీని వదిలేసి, జగన్ కు సపోర్ట్ ఇస్తున్నట్లు ప్రకటించారు.

 

అంటే అధికారికంగా వైసీపీలో చేరకుండా, వైసీపీ మద్ధతుదారుడుగా వ్యవహరించడం. అసెంబ్లీలో కూడా ఈయనకు అటు వైసీపీ, ఇటు టీడీపీ ఎమ్మెల్యేలతో కాకుండా సెపరేట్ సీటు కేటాయించారు. ఇలా చేయడం వల్ల, వంశీ పదవికి రాజీనామా చేయలేదు. అలా అని టీడీపీలో లేరు. ఇక ఇలా వంశీ చూపిన రూట్ లోనే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలిగిరి కూడా వచ్చారు. సడన్ గా బాబుకు షాక్ ఇచ్చి, జగన్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించేశారు.

 

అయితే వీరి తర్వాత ఊహించని విధంగా దశాబ్దాలు పాటు టీడీపీలో ఉన్న కరణం బలరాం కూడా జగన్ కు జై కొట్టేశారు. ఇక ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఈ ముగ్గురు ఇటు వచ్చేయడంతో, టీడీపీలో 20 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. ఈ క్రమంలోనే టీడీపీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇవ్వనున్నారని, వైసీపీ సోషల్ మీడియా విభాగాల్లో ప్రచారం జరుగుతుంది.

 

పశ్చిమ గోదావరి ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు(కలవపూడి రాంబాబు) కూడా టీడీపీని వీడొచ్చని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయన సామాజికవర్గం వైసీపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇక అందుకు తగ్గట్టుగానే ఆయన కూడా ఈ మధ్య పార్టీలో యాక్టివ్ గా కనబడటం లేదు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేస్తూ, ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పెడుతున్నారు.

 

కానీ రామరాజు మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేరు. అలాగే ఏప్రిల్ 11న మాత్రం ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం అయిన నేపథ్యంలో ఉండి ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. అయితే ఇక్కడ టీడీపీ పేరు గానీ, చంద్రబాబు పేరు గానీ వాడలేదు. ఇక దీని బట్టి చూసుకుంటే రామరాజు కూడా బాబుకు షాక్ ఇస్తారేమో అని టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మరి చూడాలి టీడీపీలోఇంకో నెంబర్ తగ్గుతుందో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: