ఏపీ రాజధానిగా విశాఖను చేయాలని జగన్ సర్కారు కొంతకాలంగా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దీనికోసం అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టారు. ఇక విశాఖ రాజధానిగా ఖాయం అయ్యిందనుకున్న సమయంలో తెలుగు దేశం మండలి ద్వారా చక్రం తిప్పి.. ఆ బిల్లు పాస్ కాకుండా అడ్డుపడింది. ఈ వ్యవహారంతో సీఎం జగన్ కు చిర్రెత్తుకొచ్చి మొత్తం మండలినే రద్దు చేయాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.

 

 

ఇప్పుడు మండలి రద్దు నిర్ణయంతో పాటు రాజధాని మార్పు అంశం కూడా పెండింగ్‌లో పడిపోయాయి. ఈ లోపు అనూహ్యంగా కరోనా అంశం తెరపైకి వచ్చేసింది. దీంతో ఇక ఇప్పుడప్పుడే విశాఖకు రాజధాని అయ్యే యోగం కనిపించడం లేదు. అయితే ఎప్పుడు వీలు కుదిరినా విశాఖే ఏపీకి రాజధానిని చేయాలన్న పట్టుదల జగన్ సర్కారుకు ఉన్న సంగతి తెలిసిందే.

 

 

ఇలాంటి పరిస్థితుల్లో జగన్ సర్కారు అనూహ్యంగా రాజధాని విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుందని వార్తలు వచ్చాయి. రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందకుండా ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లబోమని ఏపీ ప్రభుత్వం తరపున హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారని సమాచారం వచ్చింది. ఈ విషయాన్ని అఫిడవిట్ రూపంలో చెప్పాలని కోర్టు అడిగిందట. దీని కోసం ఏజీ పది రోజుల సమయం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది.

 

 

అదే నిజమైతే.. విశాఖ రాజధాని అంశం కొంతకాలంపాటు మరుగున పడక తప్పదని అంటున్నారు. బిల్లు రూపంలో కాకుండా ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూపంలో కూడా రాజధానిని విశాఖకు మార్చవచ్చని కొందరు నిపుణలు చెప్పారు. అయితే జగన్ మాత్రం బిల్లు ద్వారానే విశాఖను రాజధాని చేయాలని నిర్ణయించుకున్నట్టు తాజా సంఘటనను బట్టి అంచనా వేయాల్సి వస్తోంది. విశాఖకు రాజదానిని తరలిస్తున్నారంటూ గద్దె తిరుపతి రావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఏపీ సర్కారు హైకోర్టుకు ఈ విషయం చెప్పింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: