చైనాలో పుట్టిన కరోనావైరస్‌... ప్రపంచమంతా విస్తరించింది. యూరప్‌లో మరణ మృదంగం మోగిస్తోంది. ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ తదితర దేశాలతో పాటు జర్మనీలోనూ పెద్ద సంఖ్యలో పాజిటీవ్‌ కేసులు నమోదవుతున్నాయి. కానీ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో జర్మనీ అధినేత్రి ఏంజిలా మార్కెల్‌ కీలక పాత్ర పోషించారు. స్వతహాగా సైంటిస్ట్‌ అయిన మార్కెల్‌... ఆరంభంలోనే అప్రమత్తమై మరణాలను బాగా తగ్గించారు.


  
చైనా నుంచి యూరప్‌కు వలసొచ్చిన కరోనా వైరస్‌... ఊహించని రీతిలో విస్తరించింది. అయితే కరోనాపై ఆరంభంలోనే అప్రమత్తమైన దేశాల్లో జర్మనీ ఒకటి. కరోనా తమ దేశంలో కాలుమోపిందని గుర్తించిన వెంటనే దానిని కట్టడి చేసే ప్రయత్నాలు ప్రారంభించింది జర్మనీ. కరోనాపై పోరాటంలో జర్మన్లను ఏకతాటిపై నడిపించి... విజయం సాధించారు చాన్సలర్‌ ఏంజెలా మార్కెల్‌.

 

జనవరి 28న జర్మనీలో తొలి కరోనా పాజిటీవ్‌ కేసు నమోదయ్యింది. అయితే మార్చి మధ్య వరకూ ప్రజల దైనందిన జీవితాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపలేదు. జనం పెద్ద సంఖ్యలో పోగయ్యే పారిశ్రామిక సదస్సులను రద్దు చేసినా... చాలా మందిపై ఎలాంటి ప్రభావం పడలేదు. మార్చి 10న థియేటర్లు, ఓపెరాలు, కాన్సర్ట్‌ హాళ్లను మూసివేయడంతో తేడా స్పష్టంగా కనిపించింది. తర్వాత కొద్ది రోజుల్లోనే రెస్టారెంట్లు మూతబడ్డాయి. రోడ్లపై పాదచారులు కనిపించడం మానేశారు. టెలివిజన్‌ లైవ్‌ టెలికాస్ట్‌ ద్వారా  ప్రజల ముందుకు అరుదుగా వచ్చే జర్మనీ చాన్సలర్‌ ఏంజెలా మార్కెల్‌... మార్చి 18న ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కరోనా వైరస్‌ ప్రభావం... వ్యక్తిగత దూరం పాటించాల్సిన అవసరాన్ని వివరించారామె. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత వరకూ ఎన్నడూ దేశంలో ఇలాంటి పిరిస్థితిని ఎదుర్కోలేదంటూ... కరోనా ఎంతటి ప్రమాదకారో ప్రజలకు తెలిపారు.

 

స్వతహాగా రీసెర్చ్‌ సైంటిస్టైన ఏంజెలా మార్కెల్‌... కరోనా కట్టడి విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. లాక్‌డౌన్‌ విధించినా... సామాజిక, ఆర్థిక వ్యవస్థలు గాడి తప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలోనూ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఫలితంగా దేశంలో లక్షన్నరకు పైగా కరోనా పాజిటీవ్‌ కేసులు నమోదైనా... లక్ష మందికి పైగా పూర్తిగా కోలుకున్నారు. అలాగే, మరణాల సంఖ్యను కేవలం 5 వేల 500కు పరిమితం చేశారామె. తద్వారా జర్మనీ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు మార్కెల్‌. ప్రస్తుతం జర్మనీలో కేవలం 40 వేల పాజిటీవ్‌ కేసులున్నాయి.  

 

65 ఏళ్ల జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మార్కెల్‌ 30 ఏళ్లగా రాజకీయాల్లో ఉన్నారు. 1989లో జర్మనీ పునరేకీకరణ సమయానికి క్వాంటం కెమిస్ట్రీలో డాక్టరేట్‌ పొంది... రీసెర్చ్‌ సైంటిస్ట్‌గా పని చేస్తున్నారామె. తర్వాత కొద్ది కాలనికే  ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. 2005లో జర్మనీ చాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: