తెలంగాణ‌లోని క‌రోనా కేసుల గురించి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్‌లోని లోని బీజేపీ కార్యాలయంలో మెడికల్ పోర్టల్‌ను ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించిన కిష‌న్ రెడ్డి అనంత‌రం మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ఈ పోర్టల్ ద్వారా అత్యవసర వైద్య సేవలను అందించనున్నారు. హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నవారు త‌మ హెల్ప్ లైన్ నంబ‌ర్ 9959261273 కి కాల్ చేయొచ్చని లేదా kishanreddy.com అనే వెబ్ సైట్ లో లాగిన్ అయి జబ్బు వివరాలు డాక్టర్స్ కు వివరించవచ్చన్నారు.

 

క‌రోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అంకిత భావంతో పని చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి తెలిపారు. కొన్నిచోట్ల ప్రజలు లాక్ డౌన్‌కు సహకరించడం లేదని, దీంతో కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కిష‌న్ రెడ్డి అన్నారు. సెల్ఫ్ క్వారెంటైన్ చేసుకొని మన కుటుంబ సభ్యులను మ‌న‌మే కాపాడుకోవాలన్నారు. కోవిడ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారు, సేవలు చేస్తున్న వారు త‌గిన జాగ్తత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఏ సేవ చేసేందుకు ముందుకు వచ్చినా.. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యాలన్నారు. పేదలు‌, వృద్దులు, మహిళలు సేవలు అడిగితే విసుక్కోకుండా వారికి సేవ చేయాలన్నారు . అందరికీ మనం అండగా ఉన్నామన్న భరోసానివ్వాలని చెప్పారు. ‘అనారోగ్యానికి గురైతే ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి వారిని ఆదుకోవాల్సిన అవసరముంది. ఆరోగ్య సేతు యాప్‌లో ఆరోగ్య వివరాలు పొందుపరిస్తే… తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. అందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే… మీ చుట్టూ ఉన్న వారికి కరోనా ఉంటే అలర్ట్‌ చేస్తుంది. ఇది బాడీగార్డ్ లా పని చేస్తుందని” తెలిపారు.

 

కేంద్ర ప్రభుత్వం అధికారుల బృందాన్ని తెలంగాణ‌ రాష్ట్రానికి పంపింద‌ని కిష‌న్ రెడ్డి వెల్ల‌డించారు. , రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం, సలహాలిచ్చేందుకు ఈ బృందం పని చేస్తోందని చెప్పారు. కేంద్రం కొన్ని మినహాయింపులు ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ అమలు చేస్తోందన్నారు ఇంకా కొన్ని నగరాలు, పట్టణాల్లో అధికంగా పాజిటివ్ కేసులు వస్తున్నాయ‌ని, ఇందుకు కారణం మర్కజ్ వెళ్లి ప్రార్థనలు చేసినవారు.. తెలంగాణతో పాటు దేశం లోని అన్ని రాష్ట్రాలకు వెళ్ళారని చెప్పారు. రాష్ట్రంలో 60 శాతం కేసులు మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారివేన‌న్నారు. 50 శాతం కేసులు హైదరాబాద్ నుండే వచ్చాయని, ఒక్కో ఇంటి నుండి 20.. 30 కేసులు వస్తున్నాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: