వైసీపీ పార్టీగా ఉంది. ఏపీలో అధికారంలో ఉంది. జగన్ బంపర్ మెజారిటీతో గెలిచారు మరో నెలలో ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసుకోబోతున్నారు. అయితే ఈ ఏడాది పాలనలో తీసుకుంటే మెరుపులు ఎక్కువగానే ఉన్నాయి. మరి మరకలు ఏంటో విపక్షాలు చెబుతున్నాయి. కానీ వారి కంటే ముందు..

 

వైసీపీలోని పెద్ద నాయకులే మీడియా ముందుకు వచ్చి చెప్పేస్తున్నారు. వైసీపీలో క్రమశిక్షణ  లోపించిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. లేకపోతే వైసీపీలో కీలకమైన బాధ్యాతాయుతమైన రాజ్యాంగబధ్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం ఘాటుగా ప్రభుత్వాన్ని విమర్శించడమేంటి. నిజానికి తమ్మినేనికి జగన్ ఎంతో విలువ, గౌరవం ఇస్తారు. ప్రభుత్వంలో లోపాలు ఉంటే నేరుగా ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకురావచ్చు.

 

కానీ తమ్మినేని మీడియాకు ఎక్కారు. ఏకంగా ఎక్సైజ్  శాఖ మంత్రి మీదనే ఆయన ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వం ఫెయిల్ అనేశారు. తన జిల్లాలో అక్రమ మద్యం కట్టలు తెంచుకుని పారుతోందని కూడా తమ్మినేని చెప్పేశారు. ఓ విధంగా తమ్మినేని మంచి విషయమే చెప్పారు. కానీ అది మీడియా ముఖంగా కాకుండా జగన్ చెవిన వేసి ఉంటే బాగుండేది అన్న మాట ఉంది. ఇక శ్రీకాకుళం జిలాల్లో తమ్మినేని మంత్రిగానే వ్యవహరిస్తున్నారని,ఆయన కూడా తెగ హడావుడి చేస్తున్నారని అంటున్నారు. 

 

ప్రతీ జిల్లాలో ఈ రకమైన పరిస్థితి ఉంది. విజయనగరం జిల్లాలో చూసుకుంటే సీనియర్ మంత్రికి మరో మంత్రికి విభేదాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఎమ్మెల్యేల మధ్య అక్కడ పొంతన లేదు. విశాఖలో అయితే ఏకంగా విజయసాయిరెడ్డికి మంత్రి అవంతి శ్రీనివాస్ ల మధ్య ప్రచ్చన్న యుధ్ధం నడుస్తోందని ప్రచారంలో ఉంది. తూర్పు గోదావరి జిలాల్లో మంత్రి కన్నబాబు తన వరకూ పనిచేస్తున్నా  జిల్లా రాజకీయాన్ని ఏక త్రాటిపైన నడిపించలేకపోతున్నారని అంటున్నారు. 

 

మొత్తం మీద చూసుకుంటే వైసీపీలో విభేదాలు రచ్చకెక్కి బయటపడుతున్నాయని అంటున్నారు. ఇలాగైతే ఏడాది పాలన ముగిసేలోగానే వైసీపీలో గుప్పుమంటున్న‌ గొడవలు పెరిగి పెద్దవై అసలుకే ఎసరు తెస్తాయా అన్న డౌట్లు వస్తున్నాయి. ఇప్పటికైనా హై కమాండ్ జోక్యం చేసుకుని సర్దుబాటు చేసుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: