ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిప్పులు కురిపిస్తున్న భానుడు ఒక్కసారిగా చల్లబడ్డాడు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో పలు ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. నగరాల్లో అకాల వర్షం హాయిని కలిగిస్తుంటే.. మరోవైపు అన్నదాతలు అల్లాడిపోతున్నారు. చేతికొచ్చిన పంట ఈదురు గాలులతో నేలపాలవుతుండడంతో తలలు పట్టుకుంటున్నారు.

 

చత్తీస్‌గఢ్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో నిప్పుల కొలిమిలా ఉన్న ఏపీలో అకాలవర్షాలు కురుస్తున్నాయి. ఆగ్నేయ ఉత్తర ప్రదేశ్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి దక్షిణ తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. 900 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో.. ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది వాతావరణ శాఖ.

 

ఓ వైపు కమ్మేసిన కారుమబ్బులు.. మరో వైపు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు ప్రతాపం చూపించాయి. తిరుపతిలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం నగరాన్ని ముంచెత్తతడంతో.. మండే ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనానికి కాస్త ఉపశమనం లభించింది. దాదాపు రెండు గంటలు పడిన భారీ వర్షానికి రోడ్లన్ని జలమయం అయ్యాయి. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. దీంతో లాక్‌డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉంటున్న నగరవాసులు.. వర్షాన్ని ఎంజాయ్ చేశారు. 

 

తిరుమలలో కూడా భారీ వర్షం కురిసింది. గంట పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో.. వీధులన్ని కాలువల్లా మారిపోయాయి. మరోవైపు లాక్‌డౌన్ కారణంగా దుకాణాలు మూసిఉంచగా.. వర్షంతో అవి తడిసిపోయాయి. 36 రోజులుగా దుకాణాలు తెరవకపోవడంతో.. ఒక్కసారిగా కురిసిన భారీ నష్టం కలిగించి ఉంటుందని అంచనా వేస్తున్నారు వ్యాపారులు. ఎంత నష్టం వచ్చిందో లాక్‌డౌన్ తర్వాత మాత్రమే తెలియనుంది. 

 

అనంతపురంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పెద్ద బీభత్సాన్నే సృష్టించింది. ఉద్యానవన పంటల రైతులను దెబ్బతీసి అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒకవైపు లాక్ డౌన్ వల్ల చేతికొచ్చిన పంటను అమ్ముకోలేక సతమతమవుతుంటే.. గాలీవాన ఉన్న కాస్త పంటనూ తుడిచిపెట్టేసింది. దీంతో అరటి రైతులు లబోదిబోమంటున్నారు..

 

ఉత్తరాంధ్ర రైతులపై కూడా అకాల వర్షం పిడుగు పాటులా పడింది. విజయనగరం, విశాఖ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి మామిడి పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. కరోనా వల్ల ఇప్పటికే నష్టపోయిన తమకు.. అకాల వర్షాలు మిగిలిన పంటను నాశనం చేస్తాయని దిగాలు పడుతున్నారు.

 

మరోవైపు..మరో రెండ్రోజులపాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తూ ఉండడంతో అన్నదాతలు మరింత ఆందోళన చెందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: