దేశంలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో వేలాది మంది భారతీయులు చిక్కుకున్నారు. వీరిని వెనక్కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రత్యేక విమానాల ద్వారా వీరిని మన దేశానికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధివిధానాలపై మోదీ వారం రోజులుగా సీనియర్ మంత్రులతో చర్చిస్తున్నారు. 
 
తాజాగా కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా విదేశాల నుంచి వెనక్కు తీసుకొచ్చే వారి కోసం ఆస్పత్రి పడకలు, క్వారంటైన్ జోన్లను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాజీవ్ గౌబా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో, పోలీస్ ఉన్నతాధికారులతో ఈ విషయం గురించి మాట్లాడారు. ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు విదేశాల్లో ఉన్నావారిని తీసుకురావడానికి ఇదే సరైన సమయం అని అన్నారు. 
 
విదేశాంగ మంత్రిత్వ శాఖ విదేశాల్లో ఎంతమంది చిక్కుకున్నారు...? వారిలో ఎంతమంది భారత్ కు రావడానికి ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి అంచనా వేస్తోంది. లక్షల సంఖ్యలో విదేశాల్లో భారతీయులు చిక్కుకున్నారని తెలుస్తోంది. కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందినవారు అధిక సంఖ్యలో విదేశాల్లో చిక్కుకున్నారు. 
 
కేంద్రం అన్ని రాష్ట్రాలకు విదేశాల నుంచి తీసుకొచ్చిన పౌరులను ఆయా రాష్ట్రాలకు సమీపంలోని అంతర్జాతీయ విమానశ్రయాలకు తరలిస్తామని పేర్కొంది. వారి కోసం ఏర్పాట్లు చేయాలని.... రాష్ట్రానికి చేరుకున్న వెంటనే వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మరోవైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 25,000 దాటింది. ఇప్పటివరకు 5210 మంది డిశ్చార్జ్ కాగా 779 మంది మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రంలో నిన్న కేవలం 7 కేసులు నమోదయ్యాయి. అధికార యంత్రాంగం రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడంలో సఫలమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: