కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అయితే సింగపూర్ కు చెందిన ప్రముఖ సంస్థ భారత్ లో మే 20వ తేదీ నాటికి కరోనా అంతం కానుందని ప్రకటన చేసింది. సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సేకరించిన డేటాను విశ్లేషించి ఈ ప్రకటన చేసింది. 
 
ఈ సంస్థ మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా వైరస్ అంతం కానుందని ప్రకటన చేసింది. వివిధ దేశాలలో కరోనా అనుమానిత, సోకిన, కోలుకుంటున్న రోగుల నమూనాలను విశ్లేషించి సంస్థ వైరస్ త్వరలో అంతం కానున్నట్టు పేర్కొంది. ఈ సంస్థ వివిధ దేశాలలో కరోనా మహమ్మారి విస్తరించిన తేదీలను కూడా పరిశీలించింది. ఈ సంస్థ అంచనాలు నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది. 
 
మరోవైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 25,000కు చేరింది. వ్యాక్సిన్ ను కనిపెట్టేందుకు దేశవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. లాక్ డౌన్ వల్ల తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని, డబులింగ్ రేట్ తగ్గిందని కేంద్రం చెబుతోంది. మే 3వ తేదీలోపు కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 
 
మే 3వ తేదీలోపు కరోనా విజృంభణ తగ్గకపోతే కేంద్రం మరోసారి లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉందని సమాచారం. జూన్ నెలాఖరు వరకు లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 61 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 1016కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: