తెలంగాణ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. వర్షాధార వ్యవసాయంతో కరవు కాటకాలకు ఒకనాడు చిరునామాగా మారిన తెలంగాణ ఇప్పుడు సస్యశ్యామల తెలంగాణగా దర్శనమిస్తోంది. ఈఏడాది తెలంగాణలో అన్ని పంటలూ దిగుబడుల్లోకొత్త రికార్డులు సృష్టించాయి. ఈ ఏడాది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక స్థాయిలో దిగుబడులొస్తున్నట్లు అర్థ, గణాంక శాఖ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇచ్చింది.

 

 

ఈ నివేదికలో దిగుబడుల లెక్కలు చూస్తే కళ్లు తిరగక మానవు. తెలంగాణ ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారి ఈ ఏడాది పంటల సాగు విస్తీర్ణంలోనూ రికార్డు నమోదైంది. ఖరీఫ్‌, రబీ కలిపి 1.10 కోట్ల ఎకరాల్లో పంటలు పండాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది ఏకంగా 50 శాతం వరకూ ఎక్కువ. విస్తీర్ణానికి అనుగుణంగానే దిగుబడులూ వచ్చాయి. మొత్తం రెండున్నర కోట్ల టన్నుల దిగుబడి సాధ్యమైంది. అంటే తెలంగాణ సగటు దిగుబడికి ఇది రెట్టింపు కంటే ఎక్కువన్నమాట.

 

 

అసలు 2 కోట్ల టన్నులకు పైగా ఆహారధాన్యాలు పండటం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి. గతంలో 2016-17లో 1.40 కోట్లు పండిందే ఇప్పటి వరకూ ఉన్న రికార్డు. ఈసారి ఏకంగా అదనంగా మరో కోటి టన్నుల పంట పండటం మామూలు విషయం కాదు. మొత్తం ఆహారధాన్యాల దిగుబడులు రెండున్నర కోట్ల టన్నులుంటే అందులో కేవలం వరి, మొక్కజొన్నలే 2.34 కోట్ల టన్నులుగా ఉన్నాయి. 2018-19 ఖరీఫ్‌, రబీ సీజన్లలో మొత్తం 1.04 కోట్ల టన్నుల వరి ధాన్యం పండితే ఈసారి ఒక్క రబీలోనే అంతే స్థాయిలో ఏకంగా 1.03 కోట్ల టన్నుల దిగుబడి వచ్చింది. మొక్కజొన్న దిగుబడి దాదాపు డబుల్ అయ్యింది.

 

 

మరి ఇంత దిగుబడికి కారణాలు విశ్లేషిస్తే.. తెలంగాణలో వ్యవసాయం విద్యుత్ ఆధారితం. ఇప్పుడు కరెంటు కోతల్లేవు.. 24 గంటలూ ఉచిత విద్యుత్తు ఇస్తున్నారు. రైతుకు పెట్టుబడి సాయంగా ఎకరానికి పది వేలు ఇస్తున్నారు. వర్షాలు కూడా బాగా పడ్డాయి. ఇవన్నీకలిపి తెలంగాణను ధాన్య తెలంగాణగా మార్చేశాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: