2020 ఇద్దరు డెబ్యూ హీరోలకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఎన్నో ఆశలతో హీరోగా మారి సినిమా చేసి దానిని తెరపైన చూడాలి.. ప్రేక్షకుల స్పందన తెలుసుకోవాలని ఆశపడిన వారిద్దరి కల అంతకంతకు దూరం అవుతుంది. వారిలో తెలుగు బుల్లితెరపై త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు ఒకరు కాగా మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వైష్ణవ్ తేజ్ మరొకరు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్రదీప్ చేసిన షోస్ అన్నీ దాదాపు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఈ షోలన్నీ ఆయ‌న‌కు మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి. ఈ ఇమేజ్ తో చాలా రోజుల నుంచి ప్ర‌దీప్ వెండితెరపై హీరోగా కనిపించాలని ప్ర‌య‌త్నాలు అయితే చేసాడు కానీ స‌రైన క‌థ దొర‌క‌లేదు. ఎట్టకేలకు మున్నా అనే దర్శకుడిని ఇండస్ట్రీకి  పరిచయం చేస్తూ '30 రోజుల్లో ప్రేమించటం ఎలా' అనే సినిమా తెరకెక్కించారు. సుకుమార్ ద‌గ్గ‌ర కొన్ని సినిమాల‌కు దర్శకత్వ శాఖలో పని చేసాడు మున్నా. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి ఆదరణ పొందింది.  ఆ మధ్య వ‌దిల‌న సిద్ శ్రీరామ్ పాడిన ఈ సినిమాలోని పాట‌కి మంచి క్రేజ్ వ‌చ్చింది. ఈ పాటకి 100 మిలియన్ల వ్యూస్ కూడా వచ్చాయి. ఈ సినిమా ఫిబ్రవరిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ప్రదీప్ మాచిరాజు వెండితెరపై హీరోగా కనిపించాలనే కోరిక మరికొన్ని రోజులు వాయిదా పడింది.

 

 

మరోవైపు 'ఉప్పెన' చిత్రంతో వైష్ణవ్ ఎంట్రీకి సర్వం సిద్ధం అయ్యింది. దర్శకుడు సనా బుచ్చి బాబు తెరకెక్కించిన ఈ మూవిపై మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ సినిమాతో కృతీ శెట్టి హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌ తో పాటు రెండు లిరికల్ పాటలు వచ్చిన విషయం తెలిసిందే. అవి ప్రేక్షకులను ఆకట్టుకోగా సినిమాపై మంచి అంచనాలు పెరిగేలా చేసాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు అనుకున్నారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ మూవీ విడుదల వాయిదా పడింది. తర్వాత ఈ సినిమాను మే 7న విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ పరిస్థితులు ఇప్పుడప్పుడే అనుకూలించేలా కనపడకపోవడంతో మళ్ళీ డిసెంబ‌ర్ కి వాయిదా వేయాలని ఆలోచిస్తున్నారట. ఇలా ఈ ఇద్దరు హీరోల డెబ్యూ మూవీలకు విడుదలకు ముందే పాజిటివ్ టాక్ వచ్చినా.. కరోనా కారణంగా వాయిదాపడి ఇబ్బంది పడుతున్నారు.

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: