ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విధ్వంసం కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది. నిన్నటివరకు కర్నూలు జిల్లాలో అధిక సంఖ్యలో కేసులు నమోదు కాగా ఈరోజు కృష్ణా జిల్లాలో అధికంగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కరోనా పరీక్షల్లో 81 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 52 కేసులు కృష్ణా జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం. 
 
ప్రతిరోజూ అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్న కర్నూలు జిల్లాలో కేవలం 4 కేసులు నమోదయ్యాయి. అయితే కృష్ణా జిల్లాలోని ఉంగటూరు మండలం తరిగొప్పలలో ప్రైవేట్ ఆస్పత్రి నర్సుకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆమెను వెంటనే క్వారంటైన్ కు తరలించారు. అధికారులు ఆమెతో సన్నిహితంగా ఉన్నవారి గురించి వివరాలు సేకరిస్తున్నారు. నర్సులో కరోనా లక్షణాలు కనిపించటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 
 
మరోవైపు కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్త కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం మాస్కుల పంపిణీ చేస్తోంది. 
 
రాష్ట్రంలో ఇప్పటికే మాస్కుల పంపిణీ జరుగుతోంది. రాష్ట్రంలో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. నిన్న కేవలం రాష్ట్రంలో 7 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 990కు చేరింది. తెలంగాణలో తగ్గుముఖం పడుతున్నా ఏపీలో వేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.                           

మరింత సమాచారం తెలుసుకోండి: