నెలలు గడిచిపోతున్నాయి...! ప్రపంచ దేశాలు మాత్రం ఇంకా కరోనా ముప్పు నుంచి బయట పడలేకపోతున్నాయి. కొన్ని దేశాల్లో కాస్త నెమ్మదించినట్టు కనిపించినా రెండోవిడత విజృంభిస్తుందేమోనన్న భయం వెంటాడుతోంది. అమెరికాలో మాత్రం ఇప్పటికీ పరిస్థితి తీవ్రంగానే ఉంది. మరోవైపు బ్రిటన్‌లో కూడా కరోనా తీవ్రత కొనసాగుతోంది.

 

కరోనా మహమ్మారి అమెరికాను సర్వనాశనం చేస్తోంది.  ప్రమాద తీవ్రత తారా స్థాయికి చేరుకుంది. కరోనా విసిరిన పంజాకు 53 వేలకు పైగా అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కాలంలో అమెరికా చరిత్రలో ఈ స్థాయి మరణాలు ఎప్పుడూ సంభవించలేదు. సుమారుగా 9 లక్షల 48 వేల కరోనా కేసులతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న అగ్రరాజ్యం... కరోనా విలయానికి వణికిపోతుంది. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ లెక్కల ప్రకారం ఈ నెలలో ఇప్పటి వరకు సగటున రోజుకు 2 వేల మంది కరోనాకు బలై పోయారు.

 

24 గంటల వ్యవధిలో అమెరికాలో  22 వేల కేసులు నమోదయ్యాయి.  అధికారిక లెక్కల ప్రకారం కరోనా మరణాలు 53 వేలుగా ఉన్నా... ఆ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని అమెరికా వైద్య నిపుణులు చెబుతునున్నారు. హాస్పటల్స్, నర్సింగ్ హోమ్స్‌లో కరోనాతో చనిపోయిన వారిని మాత్రమే అధికారిక జాబితాలో చేర్చుతున్నారు. కానీ చాలా రాష్ట్రాల్లో కరోనా బాధితులు ఇళ్లలోనే ప్రాణాలు విడుస్తున్నారు. అధికారిక లెక్కల్లో వీటిని చూపించడం లేదు. ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల్లో 40 శాతం న్యూయార్క్ స్టేట్ నుంచే ఉన్నాయి.

 

న్యూయార్క్ రాష్ట్రం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది.  న్యూయార్క్‌లో ఇప్పటి వరకు 2 లక్షల 77 వేల మంది కరోనా బారిపడ్డారు. 21వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అటు బ్రిటన్‌లో కూడా కరోనా తన పంజా విసురుతోంది. గత 24 గంటల్లో 8 వందల మంది కరోనాకు బలయ్యారు. దీంతో బ్రిటన్‌లో కరోనా మరణాల సంఖ్య 20 వేలు దాటింది. యూరప్‌లో ఇటలీ, స్పెయిన్‌ల్లో కరోనా తీవ్రత తగ్గినా.. బ్రిటన్‌లో మాత్రం పరిస్థితి భయంకరంగా ఉంది. కేసులు గంటకి గంటకి పెరుగుతూనే ఉన్నాయ్‌.

 

బ్రిటన్‌లో మొత్తం కేసుల సంఖ్య లక్షా యాభై వేలకు చేరువలో ఉన్నాయ్‌. లక్ష 20 వేలకు పైగా యాక్టివ్‌ కేసులున్నాయ్‌. బ్రిటన్‌ను వెంటిలేటర్ల కొరత ఇబ్బంది పెడుతోంది. వెంటిలేటర్ల లేక చాలా మంది ప్రాణాలు కోల్పతున్నారు. కరోనా తీవ్రత ఎక్కువ ఉండటంతో బ్రిటన్‌ ఆంక్షల్ని మరింత కఠినతరం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: