పవన్ కళ్యాణ్ సినిమా నటుడు కమ్  పొలిటీషియన్. ఆయన వెండి తెరపై సింగిల్ స్టార్. పైగా పవర్ స్టార్. డిమాండ్ ఉన్న హీరో. కానీ రాజకీయాల్లో మాత్రం పవన్ మల్టీస్టారర్ మూవీతోనే సాగుతున్నారు. పవన్ సింగిల్ హీరో గా 2019లో చేసిన పొలిటికల్ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. దాంతో పవన్ పాత మిత్రుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.

 

అయితే ఈ పొత్తు పవన్ కి ఎంత మేర కలసివచ్చిందన్నది చూస్తే నిరాశేనని అంటున్నారు. ఎంతసేపూ పవన్ తనకు తానుగా మోడీని పొగుడుతూ పోవడమే తప్ప బీజేపీ నుంచి సానుకూలత లేదు. ఇక ఏపీ బీజేపీలో ఎన్నో గ్రూపులు ఉన్నాయి. వారిలో వారికే కుదరడంలేదు. దాంతో పవన్ తో కలసి ఎలా ప్రయాణం చేస్తారో ఇప్పటికీ అర్ధం కాని విషయం. ఇవన్నీ ఇలా ఉంటే పవన్ తాను ఇంత బోల్డ్ గా మోడీని, అమిత్ షాని వెనకేసుకువస్తున్నా కూడా బీజేపీ పెద్దల సహకారం మాత్రం దొరకడంలేదు.

 

ఇటీవల లాక్ డౌన్ సందర్భంగా దేశంలోని అందరు ముఖ్యమంత్రులు, ముఖ్య నాయకులతో మోడీ ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. వారి నుంచి సలహాలు తీసుకున్నారు. అదే సమయంలో ఏపీ  నుంచి చంద్రబాబుకి కూడా ఫోన్ చేశారు. అయితే చంద్రబాబు ప్రధాని ఆఫీస్ కి ఫోన్ చేసి మాట్లాడుతాను అన్న తరువాతనే మరుసటి రోజు మోడీ మాట్లాడారని అంటున్నారు. అది ఎలా ఉన్నా బాబుతోనూ మోడీ మాట్లాడగా లేనిది ఏపీలోని మిత్రపక్షం జనసేనతో మాట్లాడకపోవడమేంటని జనసైనికులు బాధపడుతున్నారుట.

 

ఇదే రకమైన బాధ పవన్ లో కూడా ఉందని అంటున్నారు. పవన్ సైతం బీజేపీ హై కమాండ్ ఒక కీలక మిత్రుడిగా తనను అసలు పరిగణనలోకి తీసుకోకపోవడం ఏంటి అన్న ఆవేదనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక ఏపీ రాజకీయాల్లో వైసీపీ, బీజేపీ హై కమాండ్ దోస్తీగా ఉంటున్నట్లుగా అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి.

 

వైసీపీకి యాంటీగా మాట్లాడుతున్న‌ కన్నా లక్ష్మీనారాయణ నోరు కట్టేసేలా బీజేపీ హై కమాండ్ వ్యహరించింది అంటే ఇక ఏపీలోని  మిగిలిన పార్టీలకు బీజేపీలో ఏమి ప్లేస్ ఉందో అర్ధమవుతోందని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే బీజేపీతో పొత్తు ఉండి కూడా సుఖం లేదని పవన్ భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: