పెంపుడు జంతువులంటే మీకు ఇష్టమా? కుక్కలు, పిల్లుల్ని పెంచుకుంటున్నారా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రోజుల పాటు పెంపుడు జంతువులకు దూరంగా ఉంటే మంచిదంటున్నారు నిపుణులు. లేదంటే మీరు కరోనా బారిన పడే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. 

 

అమెరికా న్యూయార్క్‌ బ్రోంక్స్‌ జూలో పులికి కరోనా సోకింది. మలయన్‌ జాతికి చెందిన నాలుగేళ్ల పులి నదియా ఇటీవల అస్వస్థతకు గురైంది. దీంతో దానికి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు... కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారించారు. జూ సిబ్బంది నుంచి పులికి వైరస్‌ సంక్రమించినట్టు గుర్తించారు. బెల్జియంలో ఓ పిల్లికి జలుబు, దగ్గుతో పాటు జ్వరం వచ్చింది. వెటర్నరీ డాక్టర్‌ పరీక్షలు చేసి దానికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. పిల్లి యజమానికి కూడా కరోనా పాజిటివ్‌ ఉంది. యజమాని వల్లే పిల్లికి సోకినట్టు నిర్ధారణ అయ్యింది. హాంకాంగ్‌లో  రెండు కుక్కలకు కరోనా సోకింది. పాజిటివ్ వచ్చిన పదిహేడు మంది పెంపుడు కుక్కలను వైద్యులు పరీక్షించారు. వీటిలో రెండింటింకి కరోనా సోకినట్లు తేలింది. యజమానుల వల్లే వాటికి వైరస్ వ్యాపించినట్టు గుర్తించారు  అధికారులు.

 

జంతువులకు కరోనా వ్యాపిస్తుండడం వల్ల వాటిని పెంచుకునే వాళ్లు సన్నిహితంగా ఉండడం తగ్గిస్తే మంచిదంటున్నారు డాక్టర్లు. కుక్కలు, పిల్లుల్ని  ఎత్తుకుని గారాబం చేయడం... వాటి నోట్లో చేయి పెట్టడం లాంటివి మానుకోవాలని సూచిస్తున్నారు. కానీ... వాటిని తామెప్పుడూ జంతువులుగా చూడమని, కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావిస్తుంటామని చెబుతున్నారు యజమానులు. దూరం పెడితే వాటితో పాటు తమకు కూడా మానసికంగా ఇబ్బందే అంటున్నారు పెట్ లవర్స్.

 

కరోనా సోకిన యజమానుల వల్లే  మూగజీవాలకు అది వ్యాపిస్తోందంటున్నారు వెటర్నరీ డాక్టర్లు. కానీ... జంతువుల నుంచి ఇతర జంతువులకు గాని, మనుషులకు గాని కరోనా వైరస్‌ సంక్రమించిన దాఖలాలు లేవంటున్నారు వెటర్నరీ డాక్టర్లు. ఇంత వరకూ జంతువుల నుంచి మనుషులకు కరోనా సంక్రమించకపోయినా... మనుషుల వల్ల వాటికి వైరస్‌ వ్యాపిస్తోంది. రానున్న రోజుల్లో వైరస్‌ మరింతగా మార్పు చెంది ఇతర జంతువులకు వ్యాపించి... వాటి ద్వారా తిరిగి మనుషులకు సంక్రమించే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల కొంత కాలం పెంపుడు జంతువులతో మరీ సన్నిహితంగా మెలగకపోవడం మంచిదంటున్నారు నిపుణులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: