రంజాన్ మాసం వచ్చింది అంటే చాలు వరంగల్ మండిబజార్ కళకళలాడుతుంది. కరోనా దెబ్బకు నోమూమెంట్ జోన్ లో ఉన్న మండిబజార్ వెలవెలబోతుంది. 

 

రంజాన్‌ ఆధ్యాత్మిక శోభకు వరంగల్‌లో మండి బజార్‌ వేదిక. ముస్లింలకు ఎన్నో పండగలున్నా.. పవిత్ర రంజాన్‌ అంటే ఎంతో ప్రీతి. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి ఆఖరి రోజున రంజాన్‌ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటారు. 

 

రంజాన్‌ మాసంలో పండగ నిర్వహణకు అవసరమైన కొనుగోళ్లతో నగరంలోని మండిబజార్‌ కళకళలాడేది. రోజూ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు విద్యుత్తు వెలుగులతో జిగేల్‌ మనేది. ఈ మాసంలోనే ప్రత్యేకంగా తయారుచేసే హలీమ్‌, హారీస్‌ల సందడి అంతా ఇంతా కాదు. పోచమ్మమైదాన్‌ కూడలి, మండిబజార్‌, చార్‌బౌళీ రోడ్డు, జేపీఎన్‌రోడ్డులకు ఇరువైపులా అమ్మకాలు, తెల్లవారుజాములో సహార్‌ వేళ వరకు కొనసాగేవి.ఇంత సందడిగా ఉండే మండి బాజర్ ఇప్పుడు బోసిపోయింది. కనీసం ఒక్కరు కూడా బయట కనిపించే పరిస్థితి లేదు. 

 

మండిబజార్ ప్రాంతంలో కరోనా పాజీటివ్ కేసులు నమోదు కావడంతో ఈ  ప్రాంతాన్ని నో మూమెంట్ జోన్ గా ప్రకటించారు. నెల రోజులుగా ఇక్కడకి ఎవ్వరిని అనుమతించడం లేదు. ఇక్కడి వాళ్ళను బయటకు వెళ్లనీయడం లేదు. 

 

మండిబజార్ ప్రాంతంలో నిజామ్ పూర.. చార్ బౌళీ.. ఎల్ బీ నగర్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల నుండి 7 పాజీటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్క ఎల్ బి నగర్ నుండే 52 మందిని ప్రభుత్వ క్వారంటైన్ కి పంపించారు. ఇక  ఈ మూడు ప్రాంతాల నుండి  తొమ్మిదిన్నర వేల ఇళ్ళలో.. 36 వేల 442 మందిని సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంచారు. 

 

ఈ ప్రాంతం మొత్తాన్ని నో మూమెంట్ జోన్ గా ప్రకటించిన అధికారులు ఇంటింటికి నిత్యవసర సరుకులను పంపిణి చేస్తున్నారు. యాంటీ వైరస్ రసాయలతో మండి బజార్ ప్రాంతం మొత్తం పిచికారీ చేస్తున్నారు. రంజాన్ మాసం మొత్తం ఇళ్లలోనే ఉండి, ప్రార్థనలు చేసుకోవాలని అధికారులు సూచించారు. 

 

మండి బజార్ లోని హాలీమ్, హరీష్ లాంటి షాపులే కాదు ఇఫ్తార్ విందులకు అనుమతి లేదు. కరోనా వైరస్ దరి చేరకుండా ఉండేందుకు చేపట్టిన చర్యలను అందరు పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రంజాన్ మాసంలో ముస్లింల ఉపవాస దీక్షకు అవసరమైన వాటిని అందిస్తూ, ఎవ్వరు కూడా బయటకు రాకుండా చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తున్నాయి. విడివిడిగా ఉంటూనే కరోనాను జయించడానికి,  రంజాన్ మాసాన్ని వాడుకుంటామని ముస్లిం సోదరులు తేల్చి చెబుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: