దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రస్తుతం వ్యాక్సిన్ రూపకల్పనలో నిమగ్నమై ఉన్నారు. ఇందుకు సంబంధించి వారు ఏడు కంపెనీలతో జత కట్టారు. 
 
ఈ కంపెనీలలో మన దేశం నుంచి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా జత కట్టింది. ఈ సంస్థ మరో రెండు మూడు వారాల్లో కరోనా వ్యాక్సిన్ తయారీని ప్రారంభించేందుకు యోచిస్తున్నట్టు తెలిపింది. అక్టోబర్ నాటికి భారత్ లో వ్యాక్సిన్ ను మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రకటన చేసింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో కరోనా వ్యాక్సిన్ గురించి నిన్న మీడియాతో మాట్లాడారు. 
 
ఆయన మాట్లాడుతూ ఆక్స్ ఫర్డ్ బృందానికి హిల్ నేతృత్వం వహిస్తున్నారని... మా బృందం హిల్ తో కలిసి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. మరో రెండు మూడు వారాల్లో భారత్ లో వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించి రోజుకు 50 లక్షల డోసుల చొప్పున ఉత్పత్తి చేయనున్నామని ప్రకటన చేశారు. గతంలో సీరమ్ సంస్థ మలేరియా వ్యాక్సిన్ తయారిలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి పని చేసింది. 
 
మరోవైపు దేశవ్యాప్తంగా 26917 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 5914 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 826 మంది మృతి చెందారు. ఏపీలో 1097 కరోనా కేసులు నమోదు కాగా తెలంగాణలో 1001 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టినా ఏపీలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం. ఏపీలో వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తుండటం వల్లే భారీగా కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: