దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈరోజు మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈరోజు జరుగుతోన్న వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానంగా లాక్ డౌన్ అమలు, కరోనా కట్టడి, ఆంక్షల గురించి చర్చిస్తున్నారు. 
 
ప్రధాని సీఎంలతో ప్రధానంగా లాక్ డౌన్ ను దశల వారీగా ఎత్తివేసే అంశం గురించి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మే 3వ తేదీ తర్వాత లాక్ డౌన్ ను కొనసాగించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానిని కోరుతున్నాయి. దీనిపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. కేంద్రం మే 3వ తేదీ తరువాత ఎలా ముందుకెళ్లాలో ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసిందని సమాచారం. 
 
కేంద్రం కనిష్ట చలనం... గరిష్ట పరిమితి అనే అంశంతో ముందుకెళ్లనుందని తెలుస్తోంది. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లో కొందరికి ఇంటి నుండే పని చేసేలా అవకాశం ఇవ్వనుందని తెలుస్తోంది. పారిశ్రామిక సంస్థలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో కార్మికులు, సిబ్బంది భౌతిక దూరం పాటిస్తూ షిప్ట్ వేళల్లో మార్పులు చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించనుందని తెలుస్తోంది. 
 
గ్రీన్ జోన్లలో వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రం అనుమతివ్వనుందని సమాచారం. ఎఫ్.ఆర్.బీ.ఎన్. పరిమితి పెంచాలని, ఆర్థిక సాయం అంశాల గురించి పలు రాష్ట్రాలు ప్రస్తావిస్తున్నాయని సమాచారం. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దశల వారీగా లాక్ డౌన్ ను ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. దేశంలో ఇప్పటివరకు 27,892 కరోనా కేసులు నమోదు కాగా 872 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో పీఎం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే అంశంపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: