లాక్ డౌన్ విష‌యంలో కేంద్రం నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇలాంటి త‌రుణంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించి కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు,కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటంతోపాటు లాక్‌డౌన్‌ సడలింపులపై ఎలా ముందుకు వెళ్లాలి? లాక్‌డౌన్‌ను పొడిగించాలా? లేక దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలా? తదితర విషయాలపై ముఖ్యమంత్రులతో చర్చించారు. వ‌లస కూలీలకు అందుతున్నసాయంపైనా మోదీ ఆరా తీశారు.  

 

దేశంలో లాక్‌డౌన్ విధించిన త‌ర్వాత సీఎంల‌తో ప్ర‌ధాని మోదీ మాట్లాడ‌డం ఇది మూడ‌వ‌సారి. కరోనాపై లాక్‌డౌన్‌ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోందని ప్ర‌ధాని సీఎంల‌తో పేర్కొన్నారు. `` మనం కలిసి చేస్తున్న ప్రయత్నాలు ప్రభావ చూపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ వల్ల మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. వేలమంది ప్రాణాలు రక్షించడంలో ఈ ప్రయత్నాలు చాలా ముఖ్యం. దీనిపై నిరంతరం నిపుణుల సూచనలు తీసుకుంటున్నాం.`` అని తెలిపారు. ఉపాధిహామీ పనులు, కొన్ని పరిశ్రమల పనులు ప్రారంభం అయ్యాయని, దీని ద్వారా కార్మికుల‌కు ఉపాధి దొరికింద‌ని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల సీఎంల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌ స‌మావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.  లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను ఉల్లంఘిస్తున్న‌ట్లు నివేదిక‌లు వ‌స్తున్నాయ‌ని, లాక్‌డౌన్ క‌ఠినంగా అమ‌ల‌య్యే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్ని రాష్ట్రాల సీఎంల‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు. ఈ సంద‌ర్భంగా మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్‌ ఉండాల్సిందేనని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానిని కోరారు. రెడ్‌జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగించాలని,  గ్రీన్‌జోన్లలో పూర్తి సడలింపు ఇవ్వాలని కొంతమంది సీఎంలు కోరారు. కాగా, అమిత్ షా కామెంట్ల నేప‌థ్యంలో లాక్ డౌన్ పొడ‌గించ‌‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు. 

 

కాగా, ప్ర‌ధాన‌మంత్రి స‌మావేశానికి ముందు రోజు  అన్ని రాష్ట్రాల సీఎస్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గోబ మాట్లాడారు. ఏదైనా రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదైనా ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు.  కరోనా కేసుల సంఖ్యను దాచే ప్రయత్నం చేయొద్దని కోరారు. టెస్టుల సంఖ్య పెరిగితే కేసుల సంఖ్య పెరుగుతుందనీ, కరోనా నియంత్రణకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు, సదుపాయాలను ఉపయోగించుకోవాలన్నారు. రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. దేశ వ్యాప్తంగా కరోనా నియంత్రణ కు లాక్ డౌన్ నిబంధనలను మే 3 వరకూ కట్టుదిట్టంగా అమలు చేయాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ అన్ని రాష్ట్రాలను ఆదేశించారు.  ఏరాష్ట్రంలోను కరోనా కేసుల సంఖ్యను తక్కువగా చూపడం లేదా దాచిపెట్టడం వంటి ప్రయత్నాలు చేయొద్దని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: