ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న 81 కేసులు నమోదు కాగా ఈరోజు 80 కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 1177కు చేరింది. ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో పాటు సభలు, సమావేశాలకు అనుమతులు లేవని ప్రకటన చేసింది. కానీ అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు మాత్రం లాక్ డౌన్ నిబంధనలను లెక్క చేయడం లేదు. 
 
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేశారు. చంద్రబాబు వైసీపీ నాయకులు కరోనాను రాష్ట్రంలో వ్యాప్తి చెందుతున్నారని అన్నారు. వైజాగ్ లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి వందాలాది మంది కార్యకర్తలతో వైసీపీ ఎంపీ, మంత్రి కలిసి సమావేశం నిర్వహించారని విమర్శలు చేశారు. 
 
అదే ఫంక్షన్ హాల్ లో ఏపీ ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని... వందలాది మంది కరోనా పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఇలా సమావేశాలు నిర్వహించడం ద్వారా కరోనా వైరస్ కేసులు పెరిగే అవకాశం ఉందని... ప్రభుత్వం నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మరోవైపు ప్రతిపక్షాలు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై విమర్శలు చేస్తున్నాయి. 
 
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కేసులు పెరుగుతున్నాయని, వైసీపీ నేతలే పలు చోట్ల వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని ఆరోపణలు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఇలాంటి వీడియోలు లీక్ కావడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నాలుగు జిల్లాల్లోనే దాదాపు 68 శాతం కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: