కరోనా వ్యాపించకుండా లాక్‌డౌన్‌ విధిస్తే... దీనిని కొంత మంది అధికారులు అవకాశంగా తీసుకుంటున్నారు. ఏపీ తెలంగాణ మధ్య తిరిగే నిత్యవసర సరుకుల వాహనాలకు కోవిడ్‌ ఫండ్‌ పేరుతో భారీగా జరిమానా విధిస్తున్నారు. అయితే, గ్రామ పంచాయతీలకు చెందిన ఇంటి పన్ను రసీదులపై జరిమానాలు రాయడం అనుమానాలకు తావిస్తోంది. 

 

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను అక్రమ వసూళ్లకు వినయోగించుకుంటున్నారు ఖమ్మం జిల్లాలోని కొందరు అధికారులు. అధికారాన్ని అడ్డపెట్టుకొని అమాయక ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గం.. పొరుగున ఉన్న ఆంధ్రాతో సరిహద్దును పంచుకుంటుంది. ఇక్కడి కొన్ని గ్రామాల్లో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసిన తెలంగాణ అధికారులు... అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. కరోనా వ్యాపించకుండా నిత్యసవరాలకు మినహా ఇతర వాహనాల్ని అడ్డుకోవాల్సిన అధికారులు... అందినకాడికి దండుకుంటున్నారు. సరిహద్దు ప్రాంతాలైన నందిపాడు, వినాయకపురం వద్ద చెక్ పోస్టుల వద్ద ఒక్కో వాహనం నుంచి 500 రూపాయలు వసూలు చేస్తే... 200 రూపాయలకు రసీదు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు కూరగాయల వ్యాపారులు. కోవిడ్‌-19 ఫండ్‌ పేరుతో ఇంటి పన్ను రశీదుపై రాసి ఇస్తుండడంతో విస్తుపోతున్నారు జనం. లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించారనే నెపంతో అధికారులు ఇలా వసూళ్లకు పాల్పడడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.  

 

అశ్వారావుపేట పట్టణంలోని నిత్యావసర వస్తుల దుకాణాలపై స్థానిక రెవెన్యూశాఖ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. సామాజిక దూరం పాటించడం లేదనే సాకుతో ఎడాపెడా ఫైన్లు బాదేస్తున్నారు. షాపు మూయడానికి నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం మించినా వేలల్లో ఫైన్ లు వేస్తున్నారని వాపోతున్నారు కూరగాయల వ్యాపారులు.

 

లాక్‌డౌన్‌ వల్ల అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అధికారులు ఫైన్లు పేరుతో దోచుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు జనం. పైగా, ఇంటి పన్ను రశీదులపై రాస్తున్న ఈ మొత్తాన్ని ఏ శాఖ పరిధిలోకి తీసుకుంటుందన్నది అర్థంకాని పరిస్థితి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు జనం.

మరింత సమాచారం తెలుసుకోండి: