గుంటూరు లో కరోనా కేసులు విస్తరిస్తున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వైరస్‌ పాకుతోంది. వినుకొండ ప్రాంతంలో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో నరసరావుపేటలో 29, 30 తేదీల్లో  రెండు రోజుల పాటు పూర్తి లాక్ డౌన్ అమలు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.

 

గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు 237కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎక్కువ కేసులు గుంటూరు నగరంలోనే బయటపడుతుండగా.. నరసరావుపేటలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రి ద్వారా కాంటాక్ట్ కేసులు బాగా వెలుగులోకి వచ్చాయి. నరసరావుపేటలో నమోదైన తొలి పాజిటివ్‌ కేసుల నమోదైన వ్యక్తితో హోంగార్డు కాంటాక్టు కాగా.. ఆయన స్దానికంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అక్కడ నుండి కాంటాక్ట్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. 

 

నరసరావుపేట ప్రైవేట్ ఆసుపత్రి నుంచి చిలకలూరిపేటకు కూడా కరోనా పాకింది. ఇప్పుడు వినుకొండకు కూడ నరసరావుపేట నుండే వైరస్ వ్యాప్తి చెందింది. వినుకొండకు చెందిన మహిళ తన కుమారుడి సర్జరీ కోసం నరసరావుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా వైరస్‌ సోకింది. ఆమె ఉపాధి హామీ పనులకు వెళ్లడంతో.. తోటి కూలీల్లో ఆందోళన మెదలైంది. వారిని  క్వారంటైన్ కు తరలించి.. వారి కుటుంబసభ్యులకు కూడా కరోనా టెస్టులు చేశారు. వినుకొండ లో తొలి పాజిటివ్ కేసు నమెదు కావటంతో పోలీసులు అలర్టయ్యారు. అనవసరంగా రోడ్ల మీదకు వస్తే 14రోజుల పాటు క్వారంటైన్‌కు పంపుతామని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే బోల్లా బ్రహ్మనాయుడు కోరారు.

 

మరో వైపు నరసరావుపేటలో కరోనా ఉధృతి పెరుగుతుండటంతో.. జిల్లా కలెక్టర్‌తో పాటు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరిస్థితులను సమీక్షించారు. కాంటాక్ట్‌ కేసులు పెరుగుతుండటంతో... లాక్ డౌన్ ను మరింత కఠినతరం చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఈనెల 29,30 తేదీల్లో రెండు రోజుల పాటు పూర్తి లాక్ డౌన్ ను అమలు చేయాలని నిర్ణయించారు.

 

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలోనూ తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కరోనా సోకిన ల్యాబ్ టెక్నీషియన్ దగ్గర షుగర్ టెస్ట్ చేయించుకున్న దాచేపల్లి వ్యక్తి .. అనారోగ్యం పాలై ప్రైవేట్‌ నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందాడు. అనుమానంతో టెస్టులు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 

 

మూడు రోజుల గ్యాప్ తో జిల్లాలో కొత్త నియోజకవర్గాలకు కరోనా వ్యాప్తి చెందింది. దీనికి నరసరావుపేటే కేంద్రంగా మారింది. దీనికి తోడు గుంటూరులోని రెడ్ జోన్లలో కూడా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అలర్టయిన అధికారులు.. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: