దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ అమలు వల్ల ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రధాని మోదీ మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించగా మరోసారి లాక్ డౌన్ పొడిగింపు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
 
పలు రాష్ట్రాల్లో ప్రతిరోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో లాక్ డౌన్ పొడిగింపుకే మెజారిటీ రాష్ట్రాలు మొగ్గు చూపుతున్నాయి. లాక్ డౌన్ పొడిగింపు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది. కేంద్రం, రాష్ట్రాలు ఆదాయం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సేవలు పూర్తిగా స్తంభించాయి. ఆదాయం లేకపోవడంతో ప్రజలకు మేలు చేయాలని ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాయి. 
 
రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు. కేంద్రం రాష్ట్రాలకు సహాయం చేసేలా లేదు. ఆదాయం లేకపోవడంతో పలు సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం లేదా జీతాలను వాయిదా వేయడం చేస్తున్నాయి. ప్రభుత్వాలు జీతాల్లో కోత విధించడంపై ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఇలాంటి సమయంలో కొందరు ఐఆర్ఎస్ అధికారుల బృందం మోదీకి కీలక సూచన చేసింది. పది లక్షల కంటే ఎక్కువ సంపాదించే ధనవంతులు, ఉద్యోగులపై 40 శాతం ట్యాక్స్ విధించాలని సూచించింది. మోదీ మాత్రం ఈ ప్రతిపాదనపై వ్యతిరేకత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ అంశం గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. లాక్ డౌన్ వల్ల ఇప్పటికే ధనవంతులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ప్రతిపాదనలు అమల్లోకి వస్తే మాత్రం ధనవంతులు, ఉద్యోగుల సైతం ఇబ్బందులు పడక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: