కరోనా కట్టడి కోసం మళ్లీ లాక్ డౌన్ పొడిగింపుకే మోడీ సర్కారు సిద్ధమవుతోందా.. సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్సు తర్వాత పరిణామాలు చూస్తే ఇదే ఖాయంగా కనిపిస్తోంది. దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కొనసాగింపునకే కేంద్రం మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలతో అన్నట్లు తెలుస్తోంది.

 

 

ఇప్పటికే కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న హాట్‌స్పాట్‌ ప్రాంతాలు, కొత్తగా బయట పడుతున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలో కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌ అంశంపై హోంమంత్రి అమిత్‌షాతో కలిసి సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ జరిగిన తీరు చూస్తే ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం 9 మంది సీఎంలు ఈ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. లాక్‌డౌన్‌ ముగింపునకు ఐదుగురు సీఎంలు మొగ్గు చూపారు. కానీ లాక్ డౌన్ పొడిగించాలని నలుగురు సీఎంలు కోరారు.



పరిస్థితులను సమీక్షించి మే 3 తర్వాత లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని సీఎంలతో ప్రధాని అన్నా లాక్ డౌన్ పొడిగించేందుకే మోడీ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయట. అయితే గ్రీన్ జోన్లలో మరిన్ని మినహాయింపులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే గ్రీన్‌, రెడ్‌, ఆరెంజ్‌ జోన్ల వారీగా ప్రణాళికలను తయారు చేయాలని ప్రధాని సీఎంలకు సూచించారట. కాబట్టి భారతీయలు మరోసారి లాక్ డౌన్ కు సిద్ధంగా ఉండాల్సిందే అన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే అది ఎంతకాలం అన్నది మరింత మేథోమథనం తర్వాత నిర్ణయించే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: