ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నమాట నిలబెట్టుకున్నారు. గుజరాత్ లో చిక్కుకు పోయిన 5 వేల మంది ఏపీ మత్స్యకారులను రాష్ట్రానికి రప్పించేందుకు 3 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ మొత్తాన్ని చెల్లించేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. బస్సుల ద్వారా మత్స్యకారుల ను వెనక్కు రప్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

 

 

లాక్ డౌన్ అమల్లో ఉన్నందు వల్ల వారిని ఇలా బస్సుల్లో తెచ్చేందుకు ఏపీ సర్కారు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకుంది. ఈ శుభవార్త విన్న 5 వేల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి గుజరాత్‌కు వలస వెళ్లిన మత్స్యకారులు అక్కడ లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే ఆదుకోవాలని ఉత్తరాంధ్ర మత్స్యకారులు కొన్ని రోజుల క్రితం విజ్ఞప్తి చేశారు.

 

 

అసలేం జరిగిందంటే.. గుజరాత్ లోని సోమనాథ్‌ జిల్లా వేరావల్ గ్రామంలోని ఫిషింగ్ హార్బర్‌లో ఉత్తరాంధ్రకు చెందిన ఐదు వేల మంది మత్స్యకారులు ఉండిపోయారు. అక్కడి నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోవటంతో తమను ఏపీ ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖకు చెందిన ఐదు వేల మంది మత్స్యకారులు ఆగస్టు నెలలో గుజరాత్‌కు వలస వెళ్లారు. ఏప్రిల్ నెలాఖరు వరకు సముద్ర జలాల్లోనే వేట కొనసాగిస్తారు. 8 నెలల పాటు వీరి వేట కొనసాగుతుంది.

 

 

కానీ ఇప్పుడు వేట లేదు.. కనీసం తాగటానికి కనీసం మంచినీరు కూడా లేదని వారు ఏపీ సర్కారుకు మొరపెట్టుకున్నారు. కనీసం తమను క్వారంటైన్‌లోనైనా ఉంచాలని కోరుతున్నా గుజరాత్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన చెందారు. ఇప్పుడు జగన్ సర్కారు నిర్ణయంతో వాళ్ల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: