తెలంగాణ సీఎం కేసీఆర్ మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించారు. కేసీఆర్ అవసరమైతే మే 7వ తేదీ తరువాత కూడా లాక్ డౌన్ ను కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఏపీలో లాక్ డౌన్ పరిస్థితేమిటి...? అనే ప్రశ్నకు జగన్ లాక్ డౌన్ పొడిగింపు విషయంలో మోదీ నిర్ణయానికే కట్టుబడి ఉంటారని తెలుస్తోంది. కేంద్రం లాక్ డౌన్ ను ఎప్పటివరకు పొడిగిస్తే అప్పటివరకు ఏపీలో లాక్ డౌన్ అమలు కానుంది. 
 
మరోవైపు రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. భారీగా కేసులు నమోదవుతున్నప్పటికీ ఆ కేసులన్నీ రెడ్ జోన్ ప్రాంతాలలోనే నమోదవుతూ ఉండటంతో గమనార్హం. వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా చేయడంలో ఏపీ ప్రభుత్వం సక్సెస్ అయింది. టెస్టింగ్ సామర్థ్యాన్ని భారీగా పెంచడం వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. 
 
ప్రస్తుతం అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నా మరో మూడు నాలుగు రోజుల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి కృష్ణా జిల్లాలో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కొందరి నిర్లక్ష్యం వల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. 
 
ఈ మూడు జిల్లాల్లోనే 63 శాతం కరోనా కేసులు నమోదయ్యాంటే కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఈ మూడు జిల్లాల్లో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది. రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో కొత్తవారిని అనుమతించడం లేదు. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ఒక్కొక్కరికి మూడు మాస్కుల చొప్పున పంపిణీ చేసింది. ప్రజలు మాస్కులను వినియోగించడం ద్వారా కరోనాను కట్టడి చేయడం సాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: