దేశంలో కరోనా వైరస్ వేగంగా ప్రబలుతోంది. ఐదు రాష్ట్రాలు మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలపై కరోనా పంజా విసురుతోంది. ప్రపంచ దేశాలన్నింటిలో లాక్ డౌన్ అమలవుతోంది. లాక్ డౌన్ వల్ల ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుండి పని చేసే అవకాశం కల్పించాయి. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. అయితే లాక్ డౌన్ తర్వాత కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కొనసాగనుంది. 
 
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్‌ గోపాలకృష్ణన్ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంపైనే ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. లాక్ డౌన్ తర్వాత కూడా దాదాపు 30 శాతం ఉద్యోగులు ఇంటినుంచి పని చేయడానికి ఆసక్తి కనబరుస్తారని అన్నారు. పలు భారతీయ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులు ఇళ్ల నుంచి సమర్థవంతంగా పని చేస్తున్నట్టు అభిప్రాయపడ్డాయని తెలిపారు. సాఫ్ట్ వేర్ సంస్థలు భవిష్యత్తులో తమ సేవలను ఎలా అందించాలనే దానిపై దృష్టి సారిస్తున్నాయని తెలిపారు. 
 
మరోవైపు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వర్క్ ఫ్రం హోంకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయనుందని తెలుస్తోంది. ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కేంద్రం మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నట్టు తెలుసోంది. కేంద్రం ఉద్యోగుల పనిగంటలు, వేతనం, పని వాతావరణం మొదలైన వాటిపై మార్గదర్శకాలను రూపొందించనుందని తెలుస్తోంది. 
 
ప్రస్తుతం ప్రత్యేక కార్మిక చట్టంలో వర్క్ ఫ్రం హోంకు సంబంధించిన ఎలాంటి మార్గదర్శకాలు లేవు. అందువల్ల కేంద్రం వర్క్ ఫ్రం హోంకు ప్రత్యేక మార్గదర్శకాలు అవసరమని భావిస్తోంది. హర్యానా సర్కారు ఇప్పటికే రాష్ట్రంలోని ఐటీ సంస్థలను ఉద్యోగులకు జులై 31 వరకు వర్క్ ఫ్రం హోంకు అనుమతించాలని కోరింది. దేశవ్యాప్తంగా కరోనా అదుపులోకి రాకపోవడంతో జులై 31 వరకు అన్ని కంపెనీల ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసేలా చూడాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: