ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించారు. జగన్ మాట్లాడుతూ నాన్నగారు పెద్ద చదువులు చదివితేనే పేదరికం పోతుందని భావించారని.... పెద్ద చదువులు చదివితే పేదవాళ్ల బతుకులు మారతాయని ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. నాన్నగారు చనిపోయాక ఈ పథకాన్ని నీరుగారుస్తూ వచ్చారని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం 4000 కోట్ల రూపాయలు విడుదల చేశామని అన్నారు. 
 
ఈ పథకం ద్వారా దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా పూర్తి ఫీజును అందజేయనున్నట్టు తెలిపారు. నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేసే సమయంలో ఉదయగిరిలో తండ్రి చదువుకోసం అప్పుల పాలవుతున్నాడని తెలిసి ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి చలించిపోయానని అన్నారు. పేదవాడు చదువుల కోసం, ఆరోగ్యం కోసం అప్పులపాలవుతున్నాడని అన్నారు. 
 
పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంటే చదువు మాత్రమేనని అన్నారు. కుటుంబంలో ఒక్క పిల్లాడైనా మంచి చదువులు చదివితే బతుకులు మారతాయని పేర్కొన్నారు. మార్చి 31 వరకూ ఉన్న పూర్తి బకాయిలను ఒక్క రూపాయి కూడా పెండింగులో పెట్టకుండా చెలించామని తెలిపారు. 2020 - 2021 విద్యాసంవత్సరం నుంచి ప్రతి త్రైమాసికం పూర్తైన వెంటనే తల్లుల ఖాతాలలో నగదు జమ చేస్తామని అన్నారు. 
 
బోధన, వసతులు బాగా లేకపోతే తల్లిదండ్రులకు ప్రశ్నించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎవరైనా తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజులు కట్టి ఉంటే కాలేజీలు ఆ డబ్బులను వెనక్కు చెలించాలని జగన్ చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఏవైనా సమస్యలు ఉంటే 1902 నంబర్ కు కాల్ చేయాలని సూచించారు. ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని అన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఈ పథకంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ జగన్ ను ప్రశంసిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: