టీటీడీ ఉద్యోగులు జీతాల చెల్లింపు ఇప్పుడు వివాదంగా మారుతోంది. ఉన్నతాధికారులు వ్యవహారశైలిపై మండిపడుతున్నారు టీటీడీ ఉద్యోగులు. కరోనా వైరస్ కారణంగా నిధులు లేక రాష్ట్ర ప్రభుత్వం జీతాల చెల్లింపుపై కోత విధిస్తూ ఉంటే.. టీటీడీ నిధులు ఉన్నా జీతాల్లో కోత పెడుతూ తమ జీవితాలతో ఆడుకుంటుందని అంటున్నారు ఉద్యోగులు. 

 

టీటీడీలో ఉద్యోగుల జీతభత్యాలు చెల్లింపు వ్యవహారం ముదిరిపాకాన పడుతోంది. ఉద్యోగుల జీతాభత్యాల కోసం ప్రతీ ఏటా 1300 కోట్లు వ్యయం చేస్తోంది టీటీడీ. టీటీడీ బడ్జెట్ అంచనాలు 3309 కోట్లు కాగా...ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. టీటీడీ ఆదాయానికి కూడా గండిపడింది. ప్రభుత్వం జీఓని సాకుగా చూపి ఉద్యోగులు జీతభత్యాలు చెల్లింపును గత నెల 50 శాతమే చెల్లించింది. తాము పూర్తి కాలం విధులు నిర్వర్తించినా జీతాల్లో కోత పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఉద్యోగులు. దీనికి తోడు సీఎం రిలీఫ్ ఫండ్ కు  ఒక్క రోజు వేతనంగా టీటీడీ నుంచి 86 లక్షల రూపాయలు ముఖ్యమంత్రికి అందజేశారు ఉద్యోగులు. తమకు 50  శాతం జీతం కూడా రాలేదంటున్నారు ఉద్యోగులు. మరోవైపు ప్రభుత్వం రాష్ట్ర ఖజానా పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 50 శాతం చెల్లింపు చేసిందని...మిగిలిన 50 శాతం చెల్లింపును రద్దు చేయలేదని...పరిస్థితి అనుకూలించిన సమయంలో చెల్లించేలా జీఓ ఇచ్చిందని అధికారులు చెబుతున్నారు. టీటీడీ ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు తమ జీతాలు చెల్లింపుల్లో కోత పెట్టాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. ఇది చాలదన్నట్లు ఏప్రిల్ నెలకు సంభందించిన జీతాలు చెల్లింపుని కూడా 50 శాతానికి పరిమితం చెయ్యడంపై ఆగ్రహంగా ఉన్నారు ఉద్యోగులు. ఇలా కోత పెడుతు పోతే తాము ఎలా జీవించాలని ప్రశ్నిస్తున్నారు. తాము చెల్లించాల్సిన వారికి ఏమి ఇవ్వాలి అని నిలదీస్తున్నారు ఉద్యోగులు.

 

 మరోవైపు టీటీడీ గత మాసంలో ఎల్ఐసికి చెల్లించలేదని...ఈ నెల కూడా అదే పని చేస్తే...ఒక వేళ ఉద్యోగికి ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రాకూండా పోయే ప్రమాదం ఉందని అంటున్నారు ఉద్యోగులు. టీటీడీ ఒక వైపు ఇంజినీరింగ్ పనులకు...వితరణ కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు కేటాయిస్తోంది. తమ జీతాల్లో కోత పెట్టడం సబబుగా లేదంటున్నారు ఉద్యోగులు. అసలు ఈ ఏడాది ఇప్పటి వరకు బ్రహ్మోత్సవ బహుమానం కూడా చెల్లించలేదు. సాధారణంగా అక్టోబరులో ముగిసిన బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బహుమానం జనవరి లోపు చెల్లించేవారు. కానీ టీటీడీ ఏప్రిల్ పూర్తి అవుతున్నా...ఇప్పటి వరకు ఆ దిశగా ఆలోచించలేదు. ఇప్పుడు జీతాలు చెల్లింపులో కోత పెట్టడంపై మండిపడుతున్నారు ఉద్యోగులు. ప్రస్తుతానికి అందరి దృష్టి కరోనా వైరస్‌పై ఉండడంతో సరైన సమయంలో స్పందించాలని భావిస్తున్నారు టీటీడీ ఉద్యోగులు. 

 

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం 1933లోనే ఏర్పాటు చేసినా...పూర్తిస్థాయి యంత్రాంగాన్ని 1952లో ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పటి నుంచి కూడా టీటీడీలో భక్తులకు సేవలందించేందుకు ఉద్యోగులను నియమిస్తూ వచ్చింది టీటీడీ. భక్తుల రద్దీ పెరుగుతూ ఉన్న కొద్దీ ఉద్యోగులు నియామకం పెరుగుతూ వచ్చింది. దీంతో 1996కి టీటీడీలో పనిచేసే ఉద్యోగులు సంఖ్య 16 వేలకు చేరుకుంది. అప్పటి నుంచి టీటీడీలో పర్మినెంట్ ఉద్యోగులు కంటే కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించడం ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తుందన్న భావనతో టీటీడీ అటు వైపు మొగ్గు చూపించింది. ఫలితంగా శాశ్వత ఉద్యోగులు సంఖ్య తగ్గుముఖం పడుతూ వచ్చింది. అదే సమయంలో కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2007లో చివరిగా టీటీడీలో శాశ్వత ఉద్యోగులు నియామకం చేసింది టీటీడీ. అప్పటి నుంచి కూడా టీటీడీలో ఉద్యోగులు నియామకం అదిగో....ఇదిగో అంటు వాయిదా వేస్తూనే వచ్చారు. ఉద్యోగుల నియామకం పక్కన పెడితే రిటైర్మెంట్ ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ...ప్రస్తుతం శాశ్వత ఉద్యోగులు సంఖ్య 7 వేలకు పరిమితమైంది. కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య అందుకు రెండింతలు అధికంగా 14 వేలకు చేరుకుంది. మరి ఈ వివాదాన్ని టీటీడీ పాలకమండలి ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: