జీఎస్టీ.... ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సార‌థ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప్రతిష్టాత్మ‌క ప‌న్నుల సంస్క‌ర‌ణ‌. ఈ విధానంపై ఎన్నో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మైన‌ప్ప‌టికీ... కేంద్ర ప్ర‌భుత్వం ఒకింత మొండిగానే ముంద‌కు సాగింది. ప‌న్నుల ప‌రంప‌ర‌ను కొన‌సాగించింది. అయితే, తాజాగా దీనికి బ్రేక్ ప‌డ‌నుంద‌ట‌. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచమే విలవిల్లాడుతుండ‌టం, ప్ర‌జ‌ల చేతుల్లో పైసా లేని ప్ర‌స్తుత స్థితిలో... మూడు నెలల రుణ వాయిదాల చెల్లింపులపై మారటోరియం అమలు చేస్తున్నట్టే.. ఇప్పుడు జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంద‌ని స‌మాచారం. జీఎస్‌టీని పూర్తిగా రద్దు చేయాలా..? లేదంటే కొంత కాలం పాటు చెల్లింపులను వాయిదా వేయాలా..? అన్న అంశంపై కూడా తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నట్టు ప‌లు మీడియా సంస్థ‌లు పేర్కొంటున్నాయి.

 

జీఎస్టీ విష‌యంలో కేంద్రం ఒకింత సీరియ‌‌స్‌గానే ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం. చిన్న వ్యాపారాలు చేసుకుని స్వయం ఉపాధి పొందేవారు, చిన్న తరహా పరిశ్రమలు, కంపెనీలు నడిపే యజమానులకు పెద్ద కష్టం వచ్చి పడింది. వ్యాపారం లేక రుణాలు చెల్లించలేని పరిస్థితి. అలాగే ఉద్యోగులకు జీతాలు చెల్లించ లేని దైన్యం వారిది. అందుకే కేంద్రం జీఎస్టీ విష‌యంలో సీరియ‌స్‌గా ఆలోచిస్తోంద‌ని తెలుస్తోంది. ఏదో ఒక్క రంగానికి మినహాయింపులు ఇస్తే... మిగితా రంగాల నుంచి కూడా మళ్లీ‌ వినతులు, డిమాండ్‌లు వెల్లువెత్తుతాయని, దానికి బదులు అన్ని రంగాలకు జీఎస్‌టీ చెల్లింపుల నుంచి మిన‌హాయింపు ఇస్తారంటున్నారు. 

 

లాక్‌డౌన్‌ వల్ల ఎక్కువగా దెబ్బతిన్న రెస్టారెంట్లు, హోటల్లు‌, ఎయిర్‌లైన్స్‌, రియల్‌ ఎస్టేట్‌, తయారీ వంటి రంగాలకు మాత్రమే దీన్ని పరిమితం చేస్తారా.. లేదా అన్ని రంగాలకు వర్తిస్తుందా అనే విషయంపై కూడా ప్రభుత్వ పెద్దలు చర్చోపర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇక జీఎస్టీ విష‌యంలో 3 నెలల నుంచి 6 నెలల వరకు ఉపశమనం కలిగించే అంశాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే లక్షలాది వ్యాపారులకు, కోట్ల మంది ఉద్యోగులకు శుభవార్త అందినట్టే. అయితే రద్దు చేసిన పీరియడ్‌కు పెనాల్టీలు, వడ్డీలు వసూలు చేసే యోచన కూడా ఉండబోదని స్పష్టం చేస్తున్నారు. అలా అయితేనే దాని పూర్తి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. జీఎస్టీ మిన‌హాయింపు నిర్ణ‌యం అనేక వ‌ర్గాల‌కు మేలు చేస్తుంది కాబ‌ట్టి సానుకూల నిర్ణ‌య‌మే రావ‌చ్చున‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: