కరోనా రక్కసి కాటుకు పరోక్షంగా దేశవ్యాప్తంగా చాలా మంది జర్నలిస్టులు ఉద్యోగాలు కోల్పోతున్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇలాంటి వార్తలను సదరు మీడియా సంస్థలు ఎలాగూ ప్రచురించవు కదా. అయితే ఇప్పుడు ఈ జర్నలిస్టులను సుప్రీంకోర్టు ఏమైనా ఆదుకుంటుందా.. ఉద్యోగాలు పీకేయకుండా ఆదేశాలు ఇస్తుందా.. ఉన్నపళంగా జర్నలిస్టులు రోడ్డున పడకుండా ఆదుకుంటుందా.. ?

 

 

ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం వేలాది మంది జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే.. లాక్‌డౌన్‌ సంక్షోభం సాకుతో జర్నలిస్టులను తొలగించకుండా ఆయా మీడియా సంస్థల యాజమాన్యాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జర్నలిస్టులను తొలగించకుండా ఆయా మీడియా సంస్థల యాజమాన్యాలను ఆదేశించాలని కోరుతూ ఎన్‌ఏజే, డీయూజే, ముంబై జర్నలిస్టుల యూనియన్, ఏపీడబ్ల్యూజేఎఫ్‌ దాఖలు చేసిన రిట్‌ పిటీషన్‌ను దాఖలు చేశాయి.

 

 

ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్‌ ఎన్‌వీ రమణ, సంజయ్‌ కిషన్‌ కౌల్, బీఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరిస్తూ రెండు వారాల్లోగా సమాధానాన్ని ఇవ్వాల్సిందిగా ప్రతివాదులను ఆదేశించింది. ఈ కేసులో ప్రతివాదులుగా కేంద్ర ప్రభుత్వాం, ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ, న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ ఉన్నాయి. లాక్‌డౌన్‌ సాకుతో దేశంలోని వివిధ పత్రికల, ఎలక్ట్రానిక్‌ మీడియా సంస్థల యాజమాన్యాలు జర్నలిస్టులతో సహా పలు విభాగాల సిబ్బందిని తీసివేయడమో, బలవంతంగా రాజీనామా చేయించడమో, వేతనాల్లో కోత విధించడమో, సెలవులపై వెళ్లేలా చేయడమో చేస్తున్నాయన్నది ఫిర్యాదు.

 

 

జర్నలిస్టుల పొట్టలు కొట్టకుండా కాపాడాలని ఫిర్యాదుదారులుగా ఉన్న నేషనల్‌ అలియెన్స్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (ఎన్‌ఏజే), ఢిల్లీ జర్నలిస్టుల యూనియన్‌ (డీయూజే) తదితర సంఘాల నాయకులు ఎస్‌కే పాండే, ఎన్‌.కొండయ్య, సుజాతా ముధోక్, ఇంద్ర కుమార్‌ జైన్, జి. ఆంజనేయులు తమ పిటీషన్‌లో సుప్రీంకోర్టును వేడుకున్నాయి. ఈ పరిస్థితిని ఆపేలా ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంను కోరారు. పిటీషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది కోలిన్‌ గన్సెల్వస్‌ హాజరయ్యారు. సాలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ పిటీషన్‌ ప్రతిని తనకు అందజేయాల్సిందిగా ధర్మాసనాన్ని కోరారు. మరి సుప్రీం కోర్టు జర్నలిస్టులను ఆదుకుంటుందా.. చూడాలి..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: